పంజాబ్‌లో ఎలాగైనా పాగా వేయాలని ఆప్ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, రైతు సమస్యలు, బీజేపీకి ఎదురుగాలి, కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించడంతో రాజకీయంగా కొంత అనిశ్చితి నెలకొన్నది. ఈ అనిశ్చితిని సొంతం చేసుకోవాలని ఆప్ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ పై ప్రత్యేక దృష్టిని సారించిన కేజ్రీవాల్ ఇప్పటికే అనేక వరాలు ప్రకటించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఎవర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలి అనే అంశాన్ని ప్రజలకే వదిలేశారు. పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజలు ఎవర్ని కోరుకుంటున్నారో వారిని నిలబెడతానని పేర్కొన్నారు.
Read: సీఎంలతో ప్రధాని మోడీ కాన్ఫరెన్స్…
దీని కోసం 70748 70748 ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేశారు. జనవరి 17 వ తేదీ లోగా ప్రజలు ఫోన్ లేదా మెసేజ్ రూపంలో వారి అభిప్రాయాలను తెలియజేయాలని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 14 వ తేదీన ఒకే విడతలో పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది.