Vijay Deverakonda Warns On Boycott Liger Trend: తమ సినిమా మీద ‘లైగర్’ చిత్రబృందం మొదట్నుంచీ పూర్తి నమ్మకంగా ఉంది. ఈ చిత్రం కచ్ఛితంగా ఆడియన్స్‌ని మెప్పిస్తుందని, తాము హిట్ కొట్టడం ఖాయమని ప్రతీ ఈవెంట్, ఇంటర్వ్యూలలో చెప్తోంది. ఇక విజయ్ దేవరకొండ ‘లైగర్’తో రికార్డులు తిరగరాస్తానని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అలాంటి నమ్మకాన్నే విజయవాడలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో విజయ్ వెలిబుచ్చాడు. ప్రాణం పెట్టి లైగర్ సినిమా తీశామని, అందరికీ ‘లైగర్’ నచ్చుతుందని బల్లగుద్ది చెప్పాడు. తనకు దర్శకుడు పూరీ జగన్నాథ్ కథ చెప్పినప్పుడు మెంటల్ వచ్చేసిందని, నటిస్తున్నప్పుడు త్రిల్లింగ్‌గా అనిపించిందని అన్నాడు.
మూడేళ్లు కష్టపడి తాము ఈ సినిమా చేశామని, మరో ఐదు రోజుల్లో ఇది విడుదల కాబోతోందని, అందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని విజయ్ అన్నాడు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు నుంచే టికెట్లు ఓపెన్ అయ్యాయని పేర్కొన్నాడు. ఇక ఇదే సమయంలో బాలీవుడ్‌లో నడుస్తున్న ‘బాయ్‌కాట్ లైగర్’ ట్రెండ్‌పై మాట్లాడుతూ.. ‘‘తల్లి సెంటిమెంట్‌తో ఇండియా ఫ్లాగ్ ఎగరేస్తే, మా సినిమాని బాయ్‌కాట్ చేస్తారా? చూసుకుందాం’’ అంటూ విజయ్ ఫైర్ అయ్యాడు. అంటే.. ఆ ట్రెండ్‌కి తమ సినిమానే సమాధానం చెప్తుందని అతని అభిప్రాయం. ‘ఎంతో కష్టపడి సినిమా తీస్తే.. ఇంట్లో కూర్చోవాలా?’ అంటూ ప్రశ్నించాడు. తాము ధర్మంతో ఉన్నామని, ఏదొచ్చినా కొట్లాడుడే అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ సినిమాను దర్శకనిర్మాత కరణ్ జోహర్ ఇండియాకు పరిచయం చేశాడని విజయ్ చెప్పుకొచ్చాడు.
ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. లైగర్ ఓ యాక్షన్ డ్రామా అని తెలిపాడు. తల్లి తన కుర్రోడ్ని ముంబైకి తీసుకొచ్చి, బాక్సర్‌ను చేస్తుందని.. మధ్యలో హీరో ప్రేమలో పడతాడని.. అదే లైగర్ స్టోరీ అంటూ ‘లైగర్’ కథను రివీల్ చేశాడు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడొచ్చన్నాడు. ఇదే టైంలో ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’కి లైగర్ కాపీ అంటూ వస్తున్న వార్తల్ని తోసిచ్చాడు. ఆ రెండు వేర్వేరు స్టోరీలని స్పష్టతనిచ్చాడు. లైగర్ లాంటి సినిమాను థియేటర్లలోనే చూడాలని.. ఇది ఓటీటీలో చూడాల్సిన సినిమా కాదని పూరీ వెల్లడించాడు.