33 సంవత్సరాల విక్కీ కౌశల్, 38 యేళ్ళ కత్రినా కైఫ్ ను గత యేడాది డిసెంబర్ 9న పెళ్ళి చేసుకున్నాడు. వివాహానంతరం కొంతకాలం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చిన ఈ బాలీవుడ్ జంట ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న సినిమాలో విక్కీ కౌశల్ చోటు సంపాదించుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ మూవీలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ లోని కొంతమంది యంగ్ హీరోలను దర్శక నిర్మాతలు చూశారట. అయితే రాజ్ కుమార్ హిరానీ మాత్రం చివరకు తన వేటకు విక్కీ కౌశల్ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాడట.
గతంలోనూ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘సంజు’ చిత్రంలో విక్కీ కౌశల్ నటించాడు. ఆ రకంగా విక్కీ నటన గురించి అవగాహన ఉన్న రాజ్ కుమార్ హిరానీ అతనివైపే మొగ్గు చూపాడని తెలుస్తోంది. ఎందుకంటే రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించే చిత్రాలలో హీరోతో పాటు అతని పక్కన ఉండే పాత్రలకూ మంచి గుర్తింపు ఉంటుంది. తాప్సీ నాయికగా నటించబోతున్న ఈ సినిమాలో బొమన్ ఇరానీ సైతం కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలలో హీరోగా నటిస్తున్న విక్కీ కౌశల్ ఇందులో షారుఖ్ పక్కన కీలక పాత్రకు అంగీకారం తెలిపాడంటే అది ఎంత ప్రత్యేకమైనదో ఊహించుకోవచ్చునని చిత్ర బృందం చెబుతోంది. మొత్తానికి షారుఖ్, రాజ్ కుమార్ హిరానీ చిత్రంలోకి విక్కీ కౌశల్ ప్రవేశంతో దాని వెయిటేజ్ మరింత పెరిగిందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.