ఈ రోజు ఇండియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రసీమ టాలీవుడ్. అయితే అందుకు అనుగుణంగా మన హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వెళుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఒకప్పుడు చిత్రసీమలో కమిట్ మెంట్ కి ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడది కాగడా పెట్టి వెతికినా కానరాదు. ఎవరికి వారు సక్సెస్ వెంట పరుగులు పెడుతూ అది ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు. సక్సెస్ లో ఉన్న వారిని కలుపుతూ క్రేజీ కాంబినేషన్ లు సెట్ చేసుకుని లాభ పడాలని చూసుకుంటున్నారు. అలా అని సక్సెస్ కోసం పారితోషికాలు త్యాగం చేస్తారా? అంటే… అదేం లేదు అవ్వా కావాలి…. బువ్వా కావాలి అనే టైపే అందరిదీ.
గతంలో తమ మధ్య ఎంత పోటీ ఉన్నా… ఎన్టీఆర్ నుంచి ఎ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు వరకూ అందరూ ఓ మాట మీదే నిలబడి సినిమాలు చేసేవారు. తాము సినిమా చేస్తామన్న తర్వాత సదరు దర్శకులు, నిర్మాతలకు ప్లాప్స్ వచ్చినా తమ కమిట్ మెంట్ ను మాత్రం వదలుకునే వారు కాదు. అలాగే టాప్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా. ఇప్పుడు స్టార్స్ తాము సినిమా చేస్తామన్న దర్శకుడికి ప్లాప్ వచ్చిందంటే వెంటనే కమిట్ అయిన సినిమాను వెనక్కి నెట్టడం… లేదా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయటం ఆనవాయితీగా మారింది. ఇక ఏ డైరెక్టర్ అయిన బిగ్ హిట్ ఇస్తే.. వెంటనే మన స్టార్ హీరోలు తమ సన్నిహితులనో, నిర్మాతలనో పంపించి బ్లాంక్ చెక్ ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. ఇది ఓ రకంగా సదరు దర్శకుడి పతనానికి పునాది వేయటమే. ఓ సినిమా ప్లాప్ అయిందంటే అందుకు కారణాలను విశ్లేషించుకుని తదుపరి సినిమాలో వాటిని కవర్ చేసుకుందామనే ఆలోచన ఎవరిలోనూ ఉండటం లేదు. అసలు మీడియాలో ప్లాప్ అనే మాట వస్తేనే తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోయారు. రిలీజ్ ముందు నుంచే సోషల్ మీడియా మేనేజ్ మెంట్ మొదలు పెట్టేస్తున్నారు.
తమ సినిమాలపై సద్విమర్శలు చేసిన వారిని ఆహ్వానించి సినిమాలలో భాగస్వాములు చేయటం, వారి సలహాలు తీసుకోవడం వంటి పనులను గత తరం వారు చేసేవారు. ఇప్పటి తరం వారు సద్విమర్శను కూడా నషాలానికి ఎక్కించుకుని తద్విమర్శకులను ఆమడదూరం పెట్టడమో… పెట్టించటమో చేయటంలో ఆరితేరిపోయారు. విమర్శ అనేది తమ ఎదుగుదలకు పునాది అనే మాట మరిచి ‘తాము చేసింది, తీసింది కరెక్ట్… విమర్శించే వాళ్ళకు బుర్ర లేదు’ అనే స్థితికి వచ్చేశారు. చుట్టూ వందిమాగధులను చేర్చుకుని భట్రాజు పొడగ్తలకు పొంగిపోతూ ఎవరికి వారు భస్మాసురుల్లా తయారైపోయారు. విమర్శకుల విమర్శలను పక్కన పెట్టండి… సక్సెస్ వెంట పరుగులు తీయటం ఆపండి… మంచి స్క్రిప్ట్ ల కోసం టైమ్ వెచ్చించండి. చుట్టూ ఉన్న కోటరీలను తరిమేయండి. మంచి మంచి ఆలోచనలు, కథలు మన యువత వద్ద ఉన్నాయి. అయితే అవి మీ వరకూ రావటం లేదు. అలా అనే కంటే మీరే రానీయటం లేదు అనటం సబబేమో. మంచి కథలను ఆహ్వానించండి. సక్సెస్ లో ఉన్నవారి వెంటపడే టైమ్ ని మంచి సక్సెస్ ఫుల్ కథలను ఎంపిక చేయటానికి కేటాయించండి. ఆటోమేటిక్ గా సక్సెస్ మీ దరికి చేరుతుంది. ఇది హీరోలకే కాదు, దర్శకులు, నిర్మాతలకు కూడా వర్తిస్తుంది. బి పాజిటీవ్… గెట్ సక్సెస్ త్రూ యువర్ స్మార్ట్ బిహేవియర్… ఆల్ ద బెస్ట్.