‘నాన్న కరుణతోనే కన్ను తెరిచాం… మనం…’ అనేది అందరికీ తెలిసిన సత్యమే! తమ జన్మకు కారకులైన కన్నవారిని దేవతలుగా భావించేవారందరూ ధన్యజీవులే! చిత్రసీమలోనూ తమ తల్లిదండ్రులను ఆరాధిస్తూ సాగే తారలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రప్రథమంగా జనానికి గుర్తుకు వచ్చేవారు నందమూరి నటసింహం బాలకృష్ణ అనే చెప్పాలి. ఆయన ఇప్పుడే కాదు, ఏ సందర్భంలోనైనా తమ తండ్రి మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావును తలచుకుంటూనే ఉంటారు. అది కొందరికి చిత్రంగా అనిపించవచ్చు. కానీ, మనకు జన్మనిచ్చిన వారిని ప్రతిక్షణం తలచుకోవలసిందే అన్నది బాలయ్య అభిప్రాయం! దక్షిణ భారతంలో నటనలో వారసులను ప్రవేశ పెట్టి, వారు రాణించేలా చూసిన ఘనత యన్టీఆర్ దే. ఆ తరువాతే ఎందరో నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు తమ వారసులను సైతం నటనలో ప్రవేశించేలా చూశారు. నేడు అలా వెలుగొందుతున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఆయన తండ్రి కొణిదెల వెంకట్రావు కూడా నటులే. ఆయన ‘కిలాడీ బుల్లోడు’, ‘జగత్ కిలాడీలు’ వంటి చిత్రాలలో తెరపై కనిపించారు. ఇక రంగస్థలంపైనా వెంకట్రావు తనదైన బాణీ పలికించారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే, ప్రవృత్తిగా నటనలో రాణించారాయన. అందువల్ల తండ్రి బాటలో పయనిస్తూనే చిరంజీవి సైతం చిత్రసీమలో అడుగు పెట్టారని చెప్పవచ్చు. ఇక నాగార్జున, వెంకటేశ్, మహేశ్, జూ.యన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్, మంచు విష్ణు, మంచు మనోజ్, ఆది సాయికుమార్, ఆది పినిశెట్టి… ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు మంది నటులు, దర్శకులు, నిర్మాతల తనయులే కాదు, సాంకేతిక నిపుణులు వారసులు కూడా చిత్రసీమలో నటులుగా రాణిస్తున్నారు. వారందరూ ప్రతి క్షణం తమ జన్మకు కారణమైన తండ్రిని, తాము చిత్రసీమలో ఈ స్థాయికి రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించిన ‘నాన్న’ను మరచిపోరనే భావించవచ్చు.
కేవలం హీరోలే కాదు, పలువురు నటీమణులు సైతం నటనను వారసత్వంగా తీసుకొని తెరపై వెలిగారు. ఎంతోమంది నటీమణులు తమ కన్నవారిని నటనలో ప్రవేశించేలా ప్రోత్సహించారు. కానీ, నాన్నలు తమ బిడ్డలను చిత్రసీమలో అడుగు పెట్టేందుకు ప్రోత్సహించడం అన్నది విశేషమనే చెప్పాలి. చిత్రసీమలో ఫైనాన్సియర్ గా రాణించిన కృష్ణారావు తన కూతురు లలితారాణిని నటిగా ప్రోత్సహించారు. ఆ తరువాత ఆమెనే జయప్రదగా జనం మదిని దోచారు. యావద్భారతంలోనూ నటిగా తనదైన బాణీ పలికించారు. ఆమెకు ముందు సైతం కొందరు తారలు తండ్రుల ప్రోత్సాహంతోనే నటీమణులుగా రాణించారు. అలాంటి వారిలో ఓ నాటి మేటి దర్శకులు వేదాంతం రాఘవయ్య కూతురు శుభ కూడా ఉన్నారు. యన్టీఆర్ సమకాలికులైన అమర్ నాథ్ కూతురు శ్రీలక్ష్మి మేటి హాస్యనటిగా అలరించారు. టాప్ స్టార్స్ తమ కూతుళ్ళను నటనలో అడుగు పెట్టనివ్వరు అనే అపప్రద ఉంది. కానీ, తమ అమ్మాయిలకు ఉత్సాహం ఉంటే ప్రోత్సహించిన వారూ లేకపోలేదు. నటశేఖర కృష్ణ తన కూతురు మంజులను అలాగే ప్రోత్సహించారు. తరువాత మంజుల నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా తన కూతురు మంచు లక్ష్మిని నటిగా రాణించడానికి ఆశీస్సులు అందించారు. ఆమె తనదైన విలక్షణ అభినయంతో ఆకట్టుకున్నారు. ఆమె కూడా కొన్ని చిత్రాలు నిర్మించారు. చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు సైతం తన కూతురు నిహారికను నటిగా ప్రోత్సహించారు. అంతకు ముందు నిర్మాత యార్లగడ్డ సురేంద్ర తన కూతురు సుప్రియ నటి కావాలని ఆశిస్తే సరే అన్నారు. అలా పవన్ కళ్యాణ్ తొలి హీరోయిన్ గా సుప్రియ నిలచిపోయారు. వీరే కాదు ఇలా ఎందరో తండ్రులు తమ కూతుళ్ళు తెరపై వెలగాలని ఆశిస్తే, ప్రోత్సహించిన సందర్భాలున్నాయి.
తమ పిల్లల అభిరుచికి తగ్గట్టు చిత్రసీమలో రాణించేందుకు ప్రోత్సహించిన తండ్రులందరినీ ఈ ఫాదర్స్ డే సందర్భంగా వారి పిల్లలు మరింతగా గౌరవిస్తారని ఆశిద్దాం.