సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (86) 4వ తేదీ రాత్రి రెండు గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మి గత యేడాది నవంబర్ లో మరణించారు. వారికి ఓ అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన శ్రీహరి గతవారం ఇంటిలో పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. వెంటనే నిమ్స్ లో విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఇతర అనారోగ్య సమస్యతో సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కుమారుడు శ్రీరామ్ స్వదేశానికి రాగానే గుడిపూడి శ్రీహరి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
55 సంవత్సరాల పాత్రికేయ ప్రస్థానం
గుడిపూడి శ్రీహరి 1968లో ‘ది హిందు’కు కంట్రిబ్యూటర్ గా పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈనాడు దిన పత్రికకూ తన సేవలు అందించారు. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలోనూ న్యూస్ బ్రాడ్ కాస్టర్ గా పనిచేశారు. ప్రముఖ గాయకులు, ‘సుందరకాండ’ ఎమ్మెస్ రామారావును ఆల్ ఇండియా రేడియో ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి గుడిపూడి శ్రీహరి గారికే దక్కుతుంది. అలానే 125 సంవత్సరాల సురభి నాటక సమాజం గురించి ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రపంచానికి తెలియచేసిన తర్వాత ఢిల్లీలోని సంగీత నాటక అకాడమి, ఆ సంస్థను గుర్తించి తన సహాయ సహకారాలను అందించింది. ఇరవై యేళ్ళ పాటు ఆల్ ఇండియా రేడియోకు సేవలు అందించిన గుడిపూడి శ్రీహరి ఈనాడు దిన పత్రికలో ‘హరివిల్లు’ పేరుతో 25 సంవత్సరాల పాటు శీర్షికను నిర్వహించారు.
‘సితార’ సినిమా వార పత్రికకు చిత్ర సమీక్షలు దశాబ్దాల పాటు రాశారు. తెలుగు సినిమా చిత్ర సమీక్షకు గుడిపూడి శ్రీహరి ఓ లాండ్ మార్క్ గా నిలిచారు. ఆయన సమీక్షలు గీటురాయిగా నిలిచేవంటే అతిశయోక్తి కాదు. అలానే అనేక సంవత్సరాల పాటు ది హిందు దిన పత్రిక ‘ఫ్రైడే పేజీ’, ‘సండే మేగజైన్’ సెక్షన్ కు విరివిగా వ్యాసాలు రాశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించడంతో పాటు తన తోటి సీనియర్ పాత్రికేయులతో కలిసి, బషీర్ బాగ్ లోని జర్నలిస్ట్ అసోసియేషన్ (దేశోద్ధారకభవన్) నిర్మాణానికి ఇతోధిక సేవ చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్ర, తెలుగు సినిమా రంగంపై ఆయన పుస్తకాలు రాశారు. ఎన్.ఎఫ్.డి.సి. స్క్రిప్ట్ కమిటీ సభ్యులుగా సేవలు అందించారు. గుడిపూడి శ్రీహరి మరణంతో ఓ పాత్రికేయ దిగ్గజాన్ని తెలుగు ప్రతికారంగం కోల్పోయినట్టు అయ్యింది. ఆయన మృతికి పలు జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయులు తీవ్ర సంతాపం తెలిపారు.