‘మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్’ వంటి సినిమాలు తీశారు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘వాలిమై’ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 24న విడుదల కాబోతోంది. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన ఈ సినిమా నిర్మించారు. విశేషం ఏమంటే… మార్చి 9వ తేదీ అజిత్ తో ముచ్చటగా మూడో సినిమానూ మొదలు పెట్టబోతున్నారు బోనీకపూర్. అయితే… ఇప్పటికే ఆయన నిర్మిస్తున్న పలు చిత్రాల షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వివిధ దశల్లో ఉంది. అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రధారిగా ఆయన నిర్మించిన ‘మైదాన్’ మూవీ జూన్ 3న వరల్డ్ వైడ్ వివిధ భాషల్లో విడుదల కానుంది. భారత దేశ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీద్ జీవిత కథ ఆధారంగా ‘మైదాన్’ చిత్రాన్ని అమిత్ రవీంద్రనాథ్ తెరకెక్కించారు.
ప్రియమణి, గజరాజ్ రావ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఎ. ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇదిలా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి, ఆరి, తాన్యా రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా తమిళంలో బోనీ కపూర్ ‘నెంజుకు నీది’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి అరుణ్ రాజా కామరాజ్ దర్శకుడు. అలానే తన కుమార్తె జాన్వీ కపూర్, సన్నీ కౌశల్, మనోహ్ పహ్వా తో ‘మిలీ’ చిత్రం నిర్మిస్తున్నారు. జేవియర్ మత్తుకుట్టి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకూ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్, ఊర్వశీ, ఆర్జే బాలాజీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘వీట్ల విశేషంగా’ చిత్రాన్ని కూడా బోనీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలా బోనీకపూర్ ఇప్పుడు బాలీవుడ్ తో పాటు దక్షిణాది చిత్రాలపైనా ఫోకస్ పెట్టి వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఈ చిత్రాలన్ని ఇదే యేడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.