టాలీవుడ్ కు జూలై ‘డ్రై మంత్’ గా మారిపోయింది. ఆ నెలలో విడుదలైన సినిమాల్లో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. బట్… ఆగస్ట్ ప్రారంభం అదిరిపోయింది. ఒకే రోజు వచ్చిన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. దాంతో నిర్మాతలలో కొత్త ఆశలు చిగురించాయి. సినిమా బాగుంటే థియేటర్ కు జనాలు వస్తారని, కంటెంట్ కు ప్రాధాన్యమిచ్చి సినిమా నిర్మిస్తే, తప్పకుండా సక్సెస్ దక్కుతుందని కొందరు భావించారు. ఆ ఊపుతోనే ఆగిపోయిన షూటింగ్స్ ను తిరిగి వీలైనంత త్వరగా మొదలు పెట్టాలనీ అనుకున్నారు.
ఈ నెల సెకండ్ వీకెండ్ లో వచ్చిన ‘కార్తికేయ -2’ చిత్రం ఆ విజయపరంపరను కొనసాగించింది. ఇక్కడే కాదు… నార్త్ లోనూ చక్కటి వసూళ్ళను అందుకుంటోంది. దీంతో పాజిటివ్ వైబ్స్ మరింతగా విస్తరించాయి. ఒకటి రెండు రోజుల్లో సినిమా షూటింగ్స్ మొదలైపోతాయంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే దానికి మరో నాలుగైదు రోజుల సమయం పడుతుందని, సినిమా రంగానికి సంబంధించి వివిధ వర్గాలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి రావాల్సి ఉందని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన ఐదు తెలుగు చిత్రాలు… జెండా పీకేయడడంతో మళ్ళీ అందరూ ఒక్కసారిగా డీలా పడిపోయారు.
గురువారం తమిళ అనువాద చిత్రం ‘తిరు’ విడుదలైంది. ధనుష్ గత చిత్రాల స్థాయి బజ్ ను కూడా ఈ మూవీ క్రియేట్ చేయలేకపోయింది. శుక్రవారం ఆది సాయికుమార్ ‘తీస్ మార్ ఖాన్’ వచ్చింది. రొటీన్ కథతో ఈ మూవీ బోర్ కొట్టించేసిందనే విమర్శలు వచ్చాయి. కె. రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ‘వాటెండ్ పండుగాడు’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అంటున్నారు. అసలు ఇలాంటి సినిమాలు ఏ ధైర్యంతో తీస్తున్నారనే సందేహాన్ని ఎంతోమంది వ్యక్తం చేశారు. దీనితో పాటే వచ్చిన ‘మాటరాని మౌనమిది’, ‘కమిట్ మెంట్’ మూవీస్ గురించి మాట్లాడుకున్నవాళ్ళే లేరు. ఇక ఆహాలో స్ట్రీమింగ్ అయిన ‘హైవే’మూవీ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. దీంతో…. ఆగస్ట్ థర్డ్ వీకెండ్ ఏ మాత్రం సినిమా రంగానికి కలిసిరాలేదన్నది స్పష్టమైపోయింది.
అందరి ఆశలు ‘లైగర్’ మీదనే!
ఇప్పుడు అందరి దృష్టీ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ మీదనే ఉంది. చిత్రం ఏమంటే… ఐదారు రోజుల ముందు వరకూ పాజిటివ్ బజ్ తో సాగిపోతున్న ఈ సినిమాను ఇప్పుడు ‘బాయ్ కాట్’ సెగ తగులుకుంది. మొన్న హైదరాబాద్ లో జరిగి పాత్రికేయుల సమావేశంలో విజయ్ దేవరకొండ సరదాగా టేబుల్ పై కాళ్ళు పెట్టిన ఫోటోను ట్యాగ్ చేస్తూ, నార్త్ ఇండియన్ ఆడియెన్స్ ఈ మూవీని బాయ్ కాట్ చేయమని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. దీనికి కరణ్ జోహార్ సైతం ఒక నిర్మాత కావడం, చంకీ పాండే కూతురు అనన్య హీరోయిన్ గా నటిస్తుండం ఇందుకు కారణమని చెబుతున్నారు. దీనితో పాటు హిందీ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ పరోక్షంగా ఆమీర్ ఖాన్ ను సపోర్ట్ చేయడం మరో కారణంగా తెలుస్తోంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టుగా… పాపం విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా మూవీ చేసి నార్త్ కు వెళుతుంటే… ఈ ‘బాయ్ కాట్ లైగర్’ అనే ఉచ్చు అతని మెడకు చుట్టుకుంది. బట్.. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ నేపథ్యం తెలిసిన వారు ఇతను కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తరహాలో సోలోగా చిత్రసీమలోకి అడుగుపెట్టి కష్టపడి ఈ స్థాయికి వచ్చాడని, అతన్ని తప్పనిసరిగా ఎంకరేజ్ చేయాలని అంటున్నారు. ఏదేమైనా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ వర్గాలు ‘లైగర్’ కు ఎలాంటి స్పందన వస్తుందా అని ఎదురుచూస్తున్నాయి!