Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ మొదలై నెల రోజులు గడిచాయి. హమాస్ ను పూర్తిగా నేలమట్టం చేసేదాకా విశ్రమించేంది లేదని స్పష్టం చేసింది. అయితే గాజాలోని ఆస్పత్రులను ఇజ్రాయిల్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్ షిఫాను ఆర్మీ చుట్టుముట్టింది. ఆస్పత్రులను హమాస్ కమాండ్ సెంటర్ గా వాడుకుంటోందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అందుకే వాటిని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే అల్ షిఫా ఆస్పత్రి చుట్టు ఇజ్రాయిల్ తన ట్యాంకుల్ని మోహరించింది.
ఆస్పత్రిపై దాడులను తీవ్రతరం చేయడంతో పేషెంట్లు పారిపోతున్నారు. దాడుల కారణంగా ఆస్పత్రి అంతా అంధకారం అలుముకుంది. దీంతో పిల్లల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. ఇప్పటి వరకు ఇద్దరు నవజాత శిశువులు మరణించినట్లు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. అయితే గాజాలోని ఆస్పత్రుల్లో ఉన్న శిశువులను తరలించేందుకు ఇజ్రాయిల్ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
Read Also: PM Modi: ఆర్మీ హిమాలయాల వలే దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితం..
అల్-షిఫా ఆస్పత్రితో సంబంధాలు తెగిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) ఆదివారం వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్ మాట్లాడుతూ.. తాజా నివేదిక ప్రకారం, ఆస్పత్రి చుట్టూ ట్యాంకులు ఉన్నాయని ఆయన ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. రోగుల పరిస్థితి గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చారు.
ఇజ్రాయిల్ ఉత్తరగాజా నుంచి సురక్షితమైన దక్షిణ ప్రాంతానికి వెళ్లాలని ఇజ్రాయిల్ ఆదేశించింది. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ కథనం ప్రకారం.. ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్న వారిని హమాస్ ముష్కరులు కాల్చివేస్తున్నారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపేసింది. ఆ తర్వాత నుంచి హమాస్ టార్గెట్‌గా ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. మొదట వైమానిక దాడులకే పరిమితమైనప్పటికీ.. ప్రస్తుతం భూతలదాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ దాడుల వల్ల ఇప్పటి వరకు గాజాలోని 11000 మంది పాలస్తీనియన్లు మరణించారు.