ఏరుదాటేదాక ‘ఓడ మల్లన్న’.. ఏరు దాటాక ‘బోడ మల్లన్న’ అన్నట్టుగా ఉంది తాలిబన్ల వ్యవహారశైలి. అప్ఘనిస్తాన్ దేశాన్ని వశపరుచుకోవడానికి ముందు అమెరికాకు, ప్రపంచానికి కల్లబొల్లి మాటలు చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశం ఆక్రమణలోకి వచ్చాక తమ అసలు రంగును బయటపెడుతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాలకు ఎసరు పెడుతున్నారు. మొన్నటివరకు ‘కశ్మీర్’పై సంబంధం లేదన్న తాలిబన్లు ఇప్పుడు తగ్గేదేలే అంటూ భారత్ వ్యతిరేక ప్రకటన చేయడం సంచలనమైంది.
అఫ్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరోసారి తమ వక్రబుద్దిని బయట పెట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు కూడా కశ్మీర్ అంశం.. భారత్, పాకిస్థాన్ అంతర్గత, దైపాక్షిక అంశమని స్పష్టంచేసిన తాలిబన్లు తాజాగా మాట మార్చారు. అఫ్ఘాన్ పాలన పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చిందని భావిస్తున్నారో ఏమోగానీ తాజాగా భారత్ పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.
తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ తాజాగా బీబీసీ ఉర్దూతో మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్ లోని ముస్లింలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ముస్లింల గురించి తమకు మాట్లాడే హక్కు ఉందంటూ స్పష్టం చేశారు. ముస్లింలుగా తాము.. కశ్మీర్, ఇండియా సహా ఏ దేశంలోని ముస్లింల కోసమైనా గళమెత్తే హక్కు తమకు ఉందని షహీన్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. ‘మేము ఏ దేశంపైనా ఆయుధాలను ఎక్కుపెట్టబోమని స్పష్టం చేస్తున్నాం. అయితే ముస్లింల కోసం మా స్వరాన్ని పెంచుతాం.. మీ సొంత మనుషులని, మీ దేశ పౌరులనీ, మీ చట్టాల ప్రకారం వాళ్లకు కూడా సమాన హక్కులు ఉండాలని తాము కోరుకుంటున్నామని’ షహీన్ స్పష్టం చేశాడు.
గతంలో తాలిబన్లు మాట్లాడిన మాటలకు.. అప్ఘాన్లో పాలన చేతుల్లోకి తీసుకున్నాక చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేకుండా పోతుంది. గతంలో కశ్మీర్.. ఇండియా, పాకిస్థాన్ల దైపాక్షిక అంతర్గమని అందులో తాము కలుగజేసుకోబోమని ప్రకటించారు. అయితే ఇప్పుడు మాటమార్చడం వెనుక వెనుక పాకిస్థాన్ హస్తం ఏమైనా ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఇటీవల భారత్ తాలిబన్లతో ఖతర్ దేశంలోని దోహాలో చర్చలు జరిపింది. ఆఫ్ఘన్ భూభాగం భారత్ వ్యతిరేక ఉగ్రవాద శక్తుల అడ్డాగా మారకూడదని తాలిబన్లతో చర్చల సందర్భంగా ఇండియా తేల్చిచెప్పింది. ఖతార్‌లోని ఇండియా రాయబారి దీపిక్ మిట్టల్ తాలిబన్ నేత షేర్ మహ్మద్‌ను కలిసి ఈ విషయాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాలిబన్ల నుంచి కశ్మీర్‌పై ఇలాంటి ప్రకటన రావడం చర్చనీయాంశమైంది.
అప్ఘాన్లోని పరిణామాల ప్రభావం కశ్మీర్ పై స్పష్టంగా కన్పిస్తుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అక్కడి పరిస్థితులను పాక్ ఉగ్రవాదులు అనుకూలంగా మార్చుకొని కశ్మీర్ లోయలో విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. తాలిబన్ల వ్యవహారం రాబోయే రోజుల్లో భారత్ కు తలపోటుగా మారే అవకాశాలున్నాయి. తాలిబన్ల విషయంలో భారత్ ఎలాంటి వ్యూహాంతో ముందుకెళుతుందనే మాత్రం వేచిచూడాల్సిందే..!