శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మార్చి నుంచి అక్కడ తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. శ్రీలంక ఆర్థిక సంక్షోెభానికి అధ్యక్షుడు గొటబయ రాజపక్సతో పాటు, ప్రధాని మహిందా రాజపక్సలే కారణం అని జనాలు తిరగబడ్డారు. దీంతో ఇటీవల వీరిద్దరు రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘేను శ్రీలంక పార్లమెంట్ ఎన్నుకుంది. రెండు వారాల క్రితం అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ.. రాజధాని కొలంబోలోని టెంపుల్ ట్రీస్ లో ఉన్న అధ్యక్షభవనాన్ని, అధ్యక్షుడి కార్యాాలయాన్ని ఆందోళకారులు ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో గొటబయ రాజపక్స మాల్దీవులకు, అక్కడ నుంచి సింగపూర్ కు పరారయ్యాడు.
దాదాపుగా వారం పాటు ఆందోళకారులు అధ్యక్ష భవనంలోనే ఉంటూ.. అక్కడే మద్యం తాగడం, వంట చేసుకుని తినడం, స్మిమ్మింగ్ చేయడం వంటివి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి ఇంటిలో ఉన్న దాదాపు 1000కి పైగా పురాతన కళాఖండాలు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీటి విలువ కూడా ఎక్కువగానే ఉంటుందని శ్రీలంక పోలీసులు చెబుతున్నారు. అధ్యక్ష, పీఎం భవనాలను ఆక్రమించుకున్న ఆందోళకారులే వీటిని తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
Read Also: RajiniKanth: నా జీవితంలో డబ్బు ఉంది కానీ ప్రశాంతత లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తలైవా
ఇదిలా ఉంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిరసనకారులపై చర్యలు తీసుకుంటుంది. శుక్రవారం తెల్లవారుజామున గాలేఫేజ్ లో ఉన్న నిరసనకారులపై పోలీసులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను హక్కుల సంస్థలు ఖండిస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాయి. ప్రజలు శాంతియుత నిరసనల తెలిపేందుకు హక్కు ఉందని.. అలాగే అధ్యక్షుడి భవనం, ప్రధాన మంత్రి భవనం వంటి ప్రభుత్వ భవనాలను ఆక్రమించడాన్ని అనుతించబోనని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు. వీటిని నిరోధించేందుకు సైన్యం, పోలీసులకు అధికారాలు ఇచ్చారు.