Elon Musk: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. గత శనివారం ఇరాన్ చేసిన దాడికి ప్రతిగా ఈ రోజు ఇజ్రాయిల్, ఇరాన్‌పైకి డ్రోన్లను పంపిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని కూల్చేసినట్లు ఇరాన్ చెబుతోంది. దీంతో మరోసారి ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
ఇదిలా ఉంటే మిడిల్ ఈస్ట్ పరిణామాలపై ప్రపంచ కుబేరుడు, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ స్పందించారు. ఇప్పటికే గాజా యుద్ధంతో రగులుతున్న మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలకు శాంతి సందేశాన్ని ఇచ్చారు. ఒక రాకెట్‌ని ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేస్తూ.. ‘‘మనం రాకెట్‌ని ఒకరిపై ఒకరు వేసుకోవడానికి కాదు, నక్షత్రాలకు పంపాలి’’ అని అన్నారు. రాకెట్లు ఉన్నది అంతరిక్షానికి పంపేందుకు కానీ, ఒకరిపై ఒకరు ప్రయోగించుకోవడానికి కాదని ఆయన పిలుపునిచ్చారు.
Read Also: Chhattisgarh Encounter: స్వస్థలానికి మావోయిస్టు శంకర్‌రావు దంపతుల మృతదేహాలు..
ఈ రోజు ఇరాన్‌పైకి ఇజ్రాయిల్ క్షిపణిని ప్రయోగించిందనే వార్తలు వెలువడిన గంటలో ఆయన ఈ ట్వీట్ చేశారు. గతంలో ఆయన హమాస్ దాడిలో దెబ్బతిన్న ఇజ్రాయిల్‌లోకి పలు కిబ్బట్జ్‌ని సందర్శించి ఇజ్రాయిల్‌కి సంఘీభావం ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయిల్ గాజాలో చేసిన విధ్వంసాన్ని చూడాలంటూ హమాస్ ఎలాన్ మస్క్‌ని ఆహ్వానించింది.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడి వెనక ఇరాన్ ఉందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. హమాస్ దాడిలో 1200 మంది మరణించారు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయిల్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఈ దాడిలో ఇప్పటి వరకు 30000కు పైగా పాలస్తీనియన్లు మరణించారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 1న ఇజ్రాయిల్ సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై వైమానిక దాడి చేసి, ఇరాన్‌కి చెందిన ఇద్దరు టాప్ జనరల్స్‌ని, మరికొందరు అధికారుల్ని హతమార్చింది. అప్పటి నుంచి ఇరాన్ తీవ్ర ప్రతీకారంలో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 13న ఇరాన్ ఇజ్రాయిల్‌పైకి వందలాది డ్రోన్లు, మిస్సైళ్లను పంపింది. అయితే, ఇజ్రాయిల్‌కి ఉన్న ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, ఆరో వంటి పటిష్ట ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఉండటంలో ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లను ఆకాశంలో అడ్డుకుని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇరాన్‌పై ఇజ్రాయిల్ డ్రోన్లను పంపిందనే వార్తలు రావడంతో మరోసారి రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పెరిగింది.
We should send rockets not at each other, but rather to the stars pic.twitter.com/h4apedUrsU
— Elon Musk (@elonmusk) April 19, 2024