Ukraine conflict: ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటన తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి చర్చలు మొదలవుతాయనే సంకేతాలు వెలువడ్డాయి. దీనికి బలం చేకూరుస్తూ రష్యా అధినేత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తులుగా వ్యవహరించొచ్చని పుతిన్ గురువారం చెప్పారు. యుద్ధం ప్రారంభంలో టర్కీ మధ్యవర్తిత్వం చేసి కొన్ని ఒప్పందాలను చేసుకున్నప్పటికీ, చివరకు అవి ఎన్నడూ అమలు చేయబడలేదని చెప్పారు.
‘‘మేము మా స్నేహితులను, భాగస్వాములను గౌరవిస్తాము, వారు ఈ సంఘర్షణకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధితో ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇది ప్రధానంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, బ్రెజిల్, భారతదేశం. ఈ సమస్యపై మా సహోద్యోగులతో నేను నిరంతరం సంప్రదిస్తాను. ఈ దేశాల నాయకులు, వారితో మాకు నమ్మకమైన సంబంధం ఉందని, ఈ సంక్లిష్ట ప్రక్రియ యొక్క అన్ని వివరాలను అర్థం చేసుకోవడానికి హృదయపూర్వకంగా కృషి చేస్తారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు, ’’ వ్లాడివోస్టాక్‌లోని ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో ఆయన అన్నారు.
ఉక్రెయిన్‌తో చర్చల్ని తాను ఎన్నడూ నిరాకరించలేదని, అయితే ‘‘అశాశ్వతమైన డిమాండ్‌లు’’ ఆధారంగా తాను అలా చేయనని, ఇస్తాంబుల్ ప్రారంభించిన మధ్యవర్తిత్వ చర్చలపై రష్యా అధ్యక్షుడు చెప్పారు. చర్చల్లో రష్యా ప్రధాన ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థ వృద్ధి, మాస్కో సైనిక సామర్థ్యమేనని కూడా ఆయన చెప్పారు.
Read Also: Bangladesh: హసీనా సైలెంట్‌గా ఉండాలి లేకపోతే ఆమెకి, భారత్‌కి మంచిది కాదు.. బంగ్లా చీఫ్ వార్నింగ్..
మోడీ పర్యటనలో మారిన పరిస్థితి:
ప్రధాని నరేంద్రమోడీ మూడో సారి వరసగా అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా పర్యటనకు వెళ్లారు. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ పర్యటన తర్వాత ఇటీవల ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన మోడీ, ఆ దేశ ప్రెసిడెండ్ జెలన్‌స్కీతో కూడా చర్చించారు. వరస పర్యటన మూలంగా శాంతిచర్చలకు భారత్ మధ్యవర్తిత్వం వహిస్తుందా.. అనే చర్చ మొదలైంది. రష్యా, ఉక్రెయిన్‌లను సందర్శించి అతికొద్ది మంది నాయకుల్లో మోడీ ఒకరు. ఈ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మరోసారి భారత్ తన వాణిని జెలన్‌స్కీకి చెప్పింది. సాధ్యమైన శాంతి చర్చలకు భారత్ తన మిత్రదేశాలకు అండగా నిలుస్తుందని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ వివాదం సమయంలో న్యూ ఢిల్లీ తటస్థంగా లేదా ఉదాసీనంగా ప్రేక్షకుడిని కాదని, ఎల్లప్పుడూ శాంతి పక్షాన ఉంటుందని కైవ్‌లో ఒకేరోజు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో అన్నారు. ఈ పర్యటన తర్వాత ప్రధాని మోడీ, పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడి తన పర్యటన వివరాలను పంచుకున్నారు. ప్రధాని మోడీ ప్రయత్నాలను వెస్ట్రన్ దేశాలతో పాటు అమెరికా అభినందించింది. ఈ సమస్యకు త్వరగా ముగింపు రావాలని ఆయా దేశాలు కాంక్షించాయి.