Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు (జనవరి 20) మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే, కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. అయితే, గత నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవనంపై తన మద్దతుదారులు చేసిన దాడితో వైట్ హౌస్ ను ట్రంప్ వీడాడు. ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ఈ ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయి. కానీ, ఈరోజు విపరీతమైన చలి కారణంగా వేడుకను బయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహిస్తున్నారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా సెకండ్ టైం బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాగే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరగబోతుంది. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. తొలిసారి ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇదే తరహాలోనే నిరసనలు చేశారు.
Read Also: Delhi: ఎన్నికల ముందు ఆప్‌కి భారీ షాక్.. బీజేపీలో 100కి పైగా చేరికలు..
కాగా, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన మొదటి రోజే తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. ఆ మేరకు సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ చేయనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అమెరికా సౌత్ సరిహద్దులు బంద్ చేయడంతో పాటు అక్రమ వలసదారులకు వెనక్కి పంపడం లాంటివి చాలా అంశాలపై సంతకం చేయనున్నారు. అలాగే, యూఎస్ సైన్యంలో ట్రాన్స్‌జెండర్లను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయిస్తే ఒక్కసారే 15 వేల మంది ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. పలు దేశాలపై అదనపు పన్నుల విధింపుపైనా కొత్త అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది. ఇక, భారతదేశం తరపున ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటున్నారు.