Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంది. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి షాక్ తగిలింది. ఆప్‌కి చెందిన పలువురు కార్యకర్తలు, నేతలు బీజేపీలో చేరారు. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మోడల్ టౌన్ శాసనసభలోని కమలా నగర్ వార్డు నుండి రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన కపిల్ నాగర్ బీజేపీలో చేరారు.
Read Also: Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్న రమేష్ బిధూరి సమక్షంలో అనేక మంది ఆప్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. బిధురి మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోడీ జీ కుటుంబంలో చేరిన మీ అందరికి ధన్యవాదాలు. మాకు ఇంతకంటే అదృష్టం మరొకటి లేదు. అందరి మద్దతుతో 2024లో భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించబడుతుంది’’ అని అన్నారు.
ముఖ్యమంత్రి అతిషి నాలుగున్నరేళ్లుగా ప్రజల్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని, వీధులు, రోడ్లు శిథిలావస్థకు చేరాయని అన్నారు. మురుగునీటి వ్యవస్థ సరిగా లేదని, తాగే నీరు కలుషితమైందని ఆప్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. కల్కాజీ అసెంబ్లీ నుంచి సీఎం అతిషీపై బీజేపీ రమేష్ బిధురిని బరిలోకి దింపింది. ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి.