Covid Vaccination Improves Efficacy Of Cancer Treatment, Says Study: గత మూడేళ్లుగా కరోనా వైరస్ పేరు ప్రపంచం అంతటా మారుమోగుతోంది. చైనాలోని వూహాన్ నగరంలో ప్రారంభం అయిన ఈ వైరస్ గత మూడేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోవిడ్ వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. కోట్ల సంఖ్యలో ప్రజలకు కరోనా సోకింది. లక్షల్లో మరణాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచంలోని పలు దేశాలు వ్యాక్సిన్లను రూపొందించాయి.
గత మూడేళ్లుగా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కరోనాకు అడ్డుకట్ట వేయడం సాధ్యం అవుతోంది. గణనీయంగా మరణాల సంఖ్యను తగ్గించగలిగాం. ప్రజల రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా కరోనా వైరస్ ను ఎదుర్కొనేలా మన శరీరాన్ని సమాయత్తం చేసుకోగలిగాం.
Read Also: President Droupadi Murmu: ఒడిశా పర్యటనలో భావోద్వేగానికి గురైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్ క్యాన్సర్ చికిత్స విధానాన్ని మెరుగుపరుస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. బాన్-సాంగ్సీ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అధ్యయనంలో నాసోఫారింజియల్ క్యాన్సర్ మందుల ప్రభావం, కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చిన రోగుల్లో మెరుగుగా ఉందని తేలింది. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులతో పోలిస్తే తీసుకున్న వ్యక్తుల్లో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తున్న మందుల పనితీరు మరింతగా పెరిగిందని తేలింది.
నాసోఫారింజియల్ క్యాన్సర్ అనేది గొంతును ప్రభావితం చేసే ఓ క్యాన్సర్. చాలా క్యాన్సర్లలో క్యాన్సర్ కణాలు రోగనిరోధక కణాల ప్రతిస్పందనలను అణిచివేస్తాయి. రోగనిరోధక కణాలు క్యాన్సర్ కణాలపై పనిచేయకుండా అడ్డుకుంటాయి. దీనికి పీడీ-1 అనే రిసిప్టార్ సహాయం చేస్తుంది. పీడీ-1 రిసిప్టార్ ను నిరోధించడానికి క్యాన్సర్ ఔషధాలను వాడుతారు. దీంతో రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలతో మరింతగా పోరాడే అవకాశం ఉంటుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ రోగనిరోధక స్పందనలను ప్రేరేపిస్తుంది. తద్వారా రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ పై మరింతగా పోరాడే అవకాశం ఉంటుంది.
23 ఆస్పత్రుల్లోని నాసోఫారింజియల్ క్యాన్సర్ తో చికిత్స పొందుతున్న 1,537 మంది రోగుల చికిత్సను విశ్లేషించగా వీరిలో 373 మందికి క్యాన్సర్ చికిత్స ప్రారంభించే కన్నా ముందే చైనా తయారీ సినోవాక్ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. దీంట్లో వ్యాక్సిన్ వేసినవారిలో క్యాన్సర్ చికిత్స మెరుగు అయినట్లు తేలింది.