Nikki Haley: అమెరికా అధ్యక్ష బరిలో ఉండేందుకు ఇండో – అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరుపున వివేక్ రామస్వామి, డొనాల్డ్ ట్రంప్ తరువాత రెండోస్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిక్కీ హేలీ చైనాను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేశారు. న్యూ హాంప్ షైర్ లో జరిగిన ఆర్థిక వ్యవస్థపై మేజర్ పాలసీపై ఆమె మాట్లాడారు.
అమెరికా, ప్రపంచానికి చైనా ముప్పుగా మారిందని ఆమె అన్నారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని అమెరికాను హెచ్చరించారు. అమెరికాను ఓడించేందుకు చైనా అర్ధ శతాబ్ధం కాలంగా కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని విషయాల్లో చైనా చైన్యం, అమెరికా సైన్యంతో సమానంగా ఉందని చెప్పారు. అంతకుముందు మరో రిపబ్లికన్ నేత, ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి చైనా విదేశాంగ విధానంపై ప్రసంగించారు.
చైనా, అమెరికా వాణిజ్య రహస్యాలను తెలుసుకుంటోందని, ఔషధాల నునంచి అధునాతన టెక్నాలజీ వరకు క్లిష్టమైన పరిశ్రమలను చైనా తన ఆధీనంలోకి తీసుకుంటుందని, ఆర్థికంగా వెనకబడిన దేశం నుంచి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించిందని నిక్కీ హేలీ అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అమెరికాను బెదిరించి ఆసియా వెలుపల ఆధిపత్యం చెయగల భారీ అత్యాధునిక మిలిటరీని నిర్మిస్తున్నారని ఆమె హెచ్చరించారు. అమెరికా గగనతలంలోకి బెలూన్లను పంపి గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
దీని తర్వాత ఆమె ఆర్థిక ప్రణాళికను పంచుకున్నారు. మధ్య తరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి కృషి చేస్తానని అన్నారు. మీ డబ్బును మీను మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని, మీరందరూ మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఫెడరల్ గ్యాస్, డిజిల్ పన్నును పూర్తిగా తొలగిస్తామని, దాని వల్ల రికార్డు స్థాయి గ్యాస్ ధరలతో పోరాడుతున్న కుటుంబాలకు మేలు కలుగుతుందని చెప్పారు. తాను దేశాధ్యక్షురాలిని అయితే శ్రామిక కుటుంబాలకు ఆదాయ పన్ను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. బైడెన్ చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీని తొలగిస్తామని, దీంతో శత్రుదేశాలకు మన దేశం నుంచి ఆర్థిక ద్వారాలు మూసుకుపోతాయని అన్నారు.