యువతకు బైక్ లంటే ఎంతో పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మార్కెట్ లోకి కొత్త మోడల్ వచ్చిందంటే.. దాన్ని ఎంత ఖర్చుపెట్టి అయినా సొంతం చేసుకుంటారు. ఆ బండిపై రోడ్లపై విన్యాసాలు చేస్తూ తిరుగుతారు. ఇక వెనుక ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటె .. గాల్లో తేలినట్టుందే అంటూ సాంగ్స్ వేసుకొని రెచ్చిపోతారు. తాజాగా ఒక కుర్రాడు కూడా అదే పని చేశాడు. కానీ, చివరికి హాస్పిటల్ పాలయ్యాడు. అతివేగంతో బైక్ ఫై స్టంట్ లు వేద్దామని ప్రయత్నించి బొక్క బోర్లాపడి ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటన భోపాల్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే .. ముంబైకి చెందిన ఒక యువకుడు.. భోపాల్ కి చెందిన ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం ప్రేయసిని చూడడానికి తన బైక్ ఫై భోపాల్ వెళ్ళాడు. లవర్ ని బైక్ ఎక్కించుకొని ఊరంతా తిప్పాడు. అర్ధరాత్రి అయ్యింది.. రోడ్లన్నీ ఖాళీగా మారాయి. దీంతో యువకుడు తన ప్రతిభను ప్రేయసికి చూపాలనుకున్నాడు. ఇంకేముందు ఖాళీగా ఉన్న రోడ్లపై స్టంట్ లు వేయడం మొదలుపెట్టాడు. అతివేగంగా వెళ్తూ బైక్ ముందు చక్రాన్ని గాల్లో లేపాడు. వెంటనే బ్రేక్ పడకపోవడంతో ఆ బైక్ కాస్త గాల్లో తిరుగుతూ పల్టీలు కొట్టి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. వెంటనే వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.