మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆయనను కలిసే అవకాశం తనకు దక్కిందని తెలిపారు. మన్మోహన్ సింగ్ చేసిన సేవలు ఎవరు మరిచి పోరు.. కాంగ్రెస్ రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం, సంస్కార హీనమని విమర్శించారు.
కేంద్ర హోం సహాయమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలతో ముంచెత్తడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. పవన్ కల్యాణ్ కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించిందో అంటూ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌కు రేవంత్ రెడ్డి ఏ కోణంలో గొప్పగా కనబడ్డాడో అర్థం కాలేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. అనంతరం.. సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై చర్చిస్తున్నారు. తమ వ్యాపారాన్ని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లుండి (31వ తేదీ)న పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు పోలీసుల ఆంక్షలు, షరతులు విధించారు. నూతన సంవత్సర వేడుకల వేళ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మార్గదర్శకాలను జారీ చేశారు. డిసెంబరు 31 రాత్రి తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రోడ్లు నందు చెక్ పోస్ట్‌లు, పికెట్‌లను ఏర్పాట్లు చేసి.. రాత్రి 10 గంటల నుండి వాహనాలను తనిఖీ చేయడం ప్రారంభించి, తెల్లవారుజామున వరకు కొనసాగుతుందని తెలిపారు.
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి కళాక్షేత్రంలో కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్య గురువులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. డెవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. రైతులకు అండగా ఉండే సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరులో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జి.ఎస్.ఎల్ సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర రావు ఆధ్వర్యంలో ఈ ఎడ్ల బండి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి ఔత్సాహికులు భారీగా పాల్గొన్నారు.
కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమలో తనిఖీలు చేపట్టండని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రై.లి. వ్యవహారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.