మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. డెవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. రైతులకు అండగా ఉండే సంస్కరణలను ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలో నాగేంద్ర, వాణి అనే రైతు దంపతులు ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసిందని పేర్కొన్నారు. అనధికారంగా 150 మంది రైతులు ఇప్పటి వరకూ ఆత్మహత్యలు చేసుకున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
Read Also: Parents Sell Baby: బైక్ కొనేందుకు.. 9 రోజుల నవజాత శిశువును అమ్మిన తల్లిదండ్రులు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతాయి.. రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని ఆత్మహత్యల విషయంలో కూడా చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని కాకాణి ఆరోపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో చనిపోయిన రైతు కుటుంబాలకు జగన్ పరిహారం అందించారని తెలిపారు. చంద్రబాబు ఒక కాపీ క్యాట్ లాంటివారు.. రుణమాఫీ పేరుతో అప్పుడు రైతులను మోసం చేసారు.. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తానని ప్రకటించి వారిని కూడా మోసం చేస్తున్నారని అన్నారు.
Read Also: Goa Liquor: గోవా నుంచి మద్యం తెస్తున్నారా? ఎక్సైజ్ పోలీసులు ఏం చేశారో చూడండి..
రైతు భరోసా కేంద్రాలను కూడా చంద్రబాబు నిర్వీర్యం చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. గతంలో ఆందోళన చేస్తున్న రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర బాబుది.. రాజధాని నిర్మాణం మీద ఉన్న శ్రద్ద.. రైతుల ప్రాణాల మీద చంద్రబాబుకి లేదని విమర్శించారు. తనకు వాట్సప్‌లో హాయ్ పెడితే రైతుల నుంచి ధాన్యం కొంటానని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు.. ఆయనకు ఎన్ని మెసేజ్‌లు పెట్టినా స్పందన లేదని వ్యాఖ్యానించారు. రైతులు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకుంటున్నారని కాకాణి తెలిపారు. మరోవైపు.. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని చంద్రబాబు ప్రతి సభలోనూ చెప్పారు.. ఇప్పుడు ఛార్జీలు పెంచుతున్నారని కాకాణి పేర్కొన్నారు.