గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలతు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగింది. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఐటీ కారిడార్‌లో బొమ్మ తుపాకీ చూపించి దోచుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పీఎస్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో గల తేవర్ బార్‌లో దోపిడీ జరిగింది. బొమ్మ తుపాకీతో బార్ సెక్యూరిటీ గార్డ్‌ను బెదిరించి, రూమ్‌లో బంధించి నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదు, ఒక ఐ ప్యాడ్, ఆపిల్ లాప్‌టాప్‌ను దుండగులు దోచుకెళ్లారు.
తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
పురుటి నొప్పులతోనే ఓ అభ్యర్థి గ్రూప్-2 పరీక్ష రాసిన ఆసక్తికర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే నిండు గర్భిణీ మహిళ నాగర్ కర్నూల్ పట్టిన జెడ్పీ హైస్కూల్‌లో గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు.
ఐదుగురు ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క రోజూ సభకు వచ్చారని.. 38 మంది ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఎందుకు రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ విలువ ప్రతిపక్ష నాయకుడికి ఉంటుందన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖతం అవుతుంది అని కేసీఆర్ ముందే తెలుసుకొని సభకు రావడం లేదన్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని.. చంద్రబాబు రాగానే ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో వరద వల్ల ఏపీకి ఇన్వెస్ట్మెంట్ వెళ్లే పరిస్థితి లేదన్నారు. అమరావతిలో వరద వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు భయం పట్టుకుందని మంత్రి అన్నారు.
తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.