ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ మృతితో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది.
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఇవాళ జరిగిందని మంత్రి నారాయణ వెల్లడించారు. 41వేల కోట్ల టెండర్లను 2014-19లో పిలిచి 38వేల కోట్ల పనులు ప్రారంభించామని చెప్పారు. మధ్యలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏపీలో నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రణ, నిర్మూలన, అక్రమ మద్యం నివారణ, డ్రగ్స్, మద్యం బాధితుల పునరావాసంపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోమ్, మానవ వనరుల, ఎక్సైజ్, గిరిజన సంక్షేమం, వైద్యారోగ్య శాఖ మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు , క్రీడల నిర్వహణ, గ్రామ స్థాయిలో క్రీడా స్థలాల ఏర్పాటు పై చర్చించారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే, తగలపెడుతుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటే ఎందుకు చంద్రబాబు, హోంమంత్రి అనితా కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. వీటిపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదని అడిగారు. చంద్రబాబును ఈ జిల్లా వాడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామన్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుటి నుంచి ఒక మాఫియా పాలనా చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆటవిక రాజ్యం సృష్టిస్తున్నారని... వీరి అరాచకాలపై ఢిల్లీలో పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఇంటింటికి డబ్బులు, పథకాలు వచ్చేవీ అవన్నీ మాయం అయ్యాయన్నారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2027లోనే ఎన్నికలు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలు అసంతృప్తికి గురి కావడంతో ఓటమి పాలయ్యామని అన్నారు. నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
గుంటూరు శ్యామలా నగర్‌లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బావమరిది కృష్ణారెడ్డిపై దాడి జరిగింది. ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు కొంతమంది యువకులు కర్రలు రాడ్లతో వాహనాలపై దాడి చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై సర్కార్ సీరియస్ అయింది. అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టెక్నాలజీ సాయంతో పటిష్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. నందిగామ, జగ్గయ్యపేటలో ఇసుక మాఫియా ఆగడాలపై వరుస ఫిర్యాదుల నేపథ్యంలో సీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.