ఇవాళ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 11 వ రోజు కొనసాగనున్నాయి. అయితే, నేడు సభ ముందుకు కీలక బిల్లులు వెళ్లనున్నాయి. లోక్ సభలో ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో కొత్త బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చ ప్రారంభించనున్నారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్లపై విచారణ జరగనుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ కేసుల విచారణ ప్రారంభం అవుతుంది. ఇసుక పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని.. దాంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడిందని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు ఫైల్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకోనున్నారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు మహిళా వర్సిటీలో నిర్వహించనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు.
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది.. గత రెండు రోజుల నుంచి భక్తులు తిరుమల కొండకు భారీ సంఖ్యలో వెళ్తున్నారు. డిసెంబర్ లో సెలవులు రావడంతో చివరి రెండు వారాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
నేటి నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది ఏపీ సర్కారు. ఇవాళ్టి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
నేడు తెలంగాణ పర్యటనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు. శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు చోట్ల ఇవాళ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ సౌకర్యం, ముద్రగడ పద్మనాభంపై గౌరవంతో కాపు సామాజిక వర్గం బలపరచడం వల్లే వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుంది అని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. ఏపీలో టీడీపీ- జనసేన మధ్య ఉన్న బంధాన్ని బలహీన పరచడానికి వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో కేవలం కమ్మ వాళ్లే ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నావు.. కమ్మవాళ్లల్లో కూడా కేవలం నీ చెంచా చంద్రబాబునే కోరుకుంటావు.. మద్యపానం నిషేధిస్తే పెద్ద పెద్ద ఫోటోస్ వేసి రాశావు.. మళ్లీ మద్యపానం కావాలని ఇన్కమ్ కోసం ఉండాలని నువ్వే రాశావు అని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు.