నేడు గాంధీభవన్‌లో పీఏసీ కీలక భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ?
కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ గాంధీభవన్‌లో సమావేశం కానుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో ఎఫైర్స్ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ ఠాక్రేతో పాటు ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నాహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడంపై ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నామినేటెడ్ పదవులు కూడా అస్త్రంగా మారాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50కి పైగా నామినేటెడ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రాధాన్యాల ఆధారంగా దశలవారీగా వీటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు దాదాపు ఆరు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కావడంతో.. వాటిని ఉపయోగించుకుని పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనలో నాయకత్వం ఉంది. ఆశావహులు ఎవరు? గతంలో ఎవరికి ఎలాంటి హామీలు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన పోస్టులు ఇస్తారు? చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
నేడు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
నేడు తెలంగాణ పర్యటనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు. శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు చోట్ల ఇవాళ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం 6.25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి భారత రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాత్రి 7 గంటలకు చేరుకుంటారు. దీంతో ప్రెసిడెంట్ రాకతో ఆయా మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్ కి సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్ సైతం నిర్వహించారు. సైబరాబాద్ సీపీ ఏకే మహంతి రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక, రహదారికి ఇరు వైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్, ఇంటెలిజెన్స్ సిబ్బంది ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి శీతకాల విడిదికాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్డు, బైసన్ రోడ్డు, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వెహికిల్స్ ను మళ్లించనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నామ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీస్ కమిషన్ సూచించారు.
సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ.. నేడు హైకోర్టులో విచారణ
సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. హైకోర్టు నిర్ణయం పై 27న జరిగే ఎన్నిక ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.. కాగా.. కార్మిక సంఘాల మధ్య పోరు తారాస్థాయికి చేరడమే ఇందుకు కారణం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరిన తరుణంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. కాగా.. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లకు, సిబ్బంది నియామకానికి మరికొంత సమయం కావాలని కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఇవాల (18)న వాయిదా వేసింది. ఈ పిటిషన్ వెనుక ఎన్‌ఐటీయూసీ రాజకీయం ఉందని ఏఐటీయూసీ ఆరోపించింది. అయితే తాము చేసినవన్నీ చేసి పరువు తీస్తున్నారని ఏఐటీయూసీపై ఎన్‌ఐటీయూసీ నేతలు మండిపడ్డారు. దీనిపై ఇరువురు నేతలు విమర్శలు గుప్పించారు. వారి పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా.. తాజా పిటిషన్‌తో సింగరేణి ఎన్నికలు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? లేక మరో వాయిదా అనే చర్చ సింగరేణిలో నడుస్తోందా? అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నేపథ్యంలో 27న జరగనున్న ఎన్నికలపై హైకోర్టు సోమవారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
నేటి నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం..
నేటి నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనుంది ఏపీ సర్కారు. ఇవాళ్టి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. కార్డులో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుని ఫోటో, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్య వివరాలతో ABHA ఐడీ అందించనున్నారు. 4.52 లక్షల మంది లబ్ధిదారులకు ఆరోగ్య శ్రీ సేవలపై అవగాహన కల్పించనున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ అమలులో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు నూతన కార్డులు ఇవాళ్టి నుంచి మంజూరు చేయనుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ. 25 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం అమలుకు ఇప్పటికే ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతీ ఇంటిలో ఒకరికీ ఆరోగ్యశ్రీ యాప్ తప్పనిసరి చేసింది. ప్రతీ ఇంటికి వెళ్లాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
తిరుమలలో నేటి నుంచి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. దీంతో గవర్నర్ టూర్ కు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నగరంలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ మీటింగ్ నిర్వహించారు. ఇవాళ ఉదయం 10.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకోనున్నారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు మహిళా వర్సిటీలో నిర్వహించనున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. ఇక, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు (మంగళవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకుని, సాయంత్రం రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు ఆయన బయలుదేరుతారు. అయితే, గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ముంబై దాడుల సూత్రధారి దావూద్ ఇబ్రహీం పై విష ప్రయోగం
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం చేశారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరాచీలో విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం.. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. అయితే దావూద్ విషప్రయోగం చేశాడన్న వార్త ఏ రిపోర్టులోనూ ధృవీకరించబడలేదు. దావూద్ చేరిన ఆస్పత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆసుపత్రిలోని ఆ అంతస్తులో దావూద్ ఒక్కడే రోగి. ఉన్నత ఆసుపత్రి అధికారులు, వారి సన్నిహిత కుటుంబ సభ్యులకు మాత్రమే అంతస్తులో ప్రవేశం ఉంది. పాకిస్థాన్‌లో దావూద్‌పై విషప్రయోగం జరిగిందన్న వార్తతో ఆ దేశంలో కలకలం రేగింది. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ వంటి దేశంలోని అనేక పెద్ద నగరాల్లో కూడా సర్వర్లు పనిచేయవు. ఇది కాకుండా ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా పనిచేయడం లేదు. రాత్రి 8 గంటల తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ గవర్నెన్స్‌ను పర్యవేక్షించే నెట్‌బ్లాక్ అనే సంస్థ పాకిస్థాన్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధాన్ని ధృవీకరించింది.
క్రిస్మస్ పార్టీలో కాల్పులు.. 16 మంది మృతి
మెక్సికోలోని ఉత్తర-మధ్య రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా నగరంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ పార్టీపై ముష్కరులు దాడి చేసి డజను మందిని చంపారు. సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు వ్యక్తులు మరణించారని, అయితే ఆ దాడికి సంబంధించిన పరిస్థితుల గురించి సమాచారం ఇవ్వలేదని స్టేట్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. సాల్వాటియెర్రాలోని బాధితులు క్రిస్మస్ పార్టీ తర్వాత పోసాడా అని పిలువబడే ఈవెంట్ హాల్ నుండి బయటకు వెళుతున్నప్పుడు కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా తెలిపింది. గ్వానాజువాటో జాలిస్కో కార్టెల్, సినాలోవా కార్టెల్ మద్దతు ఉన్న స్థానిక ముఠాల మధ్య నిరంతరం దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ మెక్సికో రాష్ట్రంలో అత్యధిక హత్యలు జరిగాయి. పార్టీలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ.. సుమారు ఆరుగురు తుపాకీలతో వేదికపైకి ప్రవేశించారు. కార్యక్రమంలో గుమిగూడిన యువకుల మధ్య ఆ వ్యక్తులు సంచరించడం ప్రారంభించారు. తమకు ఆహ్వానం లేదని గ్రహించి ఆ వ్యక్తులు ఎవరని అడిగితే కాల్పులు జరిపారని తెలిపారు. మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో గ్వానాజువాటో ఒకటి. దీనికి ప్రధాన కారణం క్రిమినల్ ముఠాల ఉనికి, కార్యకలాపాలు. ఇందులో డ్రగ్ కార్టెల్ కూడా ఉంది. శాన్ జోస్ డెల్ కార్మెన్ కమ్యూనిటీలో జరిగిన దురదృష్టకర హింసాత్మక ఘటనను ఖండిస్తున్నాను అని సాల్వాటియెర్రా మేయర్ జర్మన్ సెర్వంటెస్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,029 మెక్సికోలో అత్యధిక హత్యలు జరిగిన రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానం ఉంది.
రెచ్చిపోయిన పల్లవి ప్రశాంత్ అభిమానులు.. అమర్‌దీప్ కారుపై దాడి! వేడుకున్నా వినలేదు
బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్‌గా ప్రశాంత్ రికార్డుల్లోకెక్కాడు. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో చాలా మందికి తెలియదు.. ఇప్పుడు బిగ్‌బాస్ టైటిల్ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్‌దీప్ నిలిచాడు. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌ను ప్రకటించిన అనంతరం అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్‌దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. బిగ్‌బాస్ 7 షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు ఆదివారం పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులు వచ్చారు. ప్రశాంత్ విజేతగా నిలవగానే ఆయన ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో అమర్, ప్రశాంత్ అభిమానుల చిన్న గొడవ మొదలైంది. అది కాస్త చినికి గాలివానలా మారింది. ఒకరినొకరు తోసుకుంటూ, పిడిగుద్దులు గుద్దుకుంటూ.. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు (కొండాపూర్-సికింద్రాబాద్)పై దాడి చేసి.. అద్దాన్ని పగలగొట్టారు.
కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఆండిలే ఫెలుక్వాయో (33) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీలు చేశారు. మొదటి వన్డేలో భారత జట్టును నడిపించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. వరుసగా అత్యధిక విజయాలు సాధించిన భారత మూడో కెప్టెన్‌గా రాహుల్ నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. రాహుల్‌కు 10 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వరుసగా విజయం సాధించగా.. ధోనీ 9 మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయాలు అందించాడు. రాహుల్ 2022 నుంచి 2023 వరకు తన కెప్టెన్సీలో భారత జట్టుకు వరుసగా 10 విజయాలు అందించాడు. మహీ 2013లో 9 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు అందుకున్నాడు.