AP High court: నేడు ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటీషన్లపై విచారణ జరగనుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ కేసుల విచారణ ప్రారంభం అవుతుంది. ఇసుక పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని.. దాంతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడిందని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు ఫైల్ చేశారు. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ( ఐఆర్ఆర్ ) కేసులో టీడీపీ అధినేత క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారంటూ ఆయనపై సీబీఐ అధికారులు మరో కేసు నమోదు చేశారు. దీంతో ఈ రెండు కేసులపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగనుంది. ఈ రెండు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది.