విశాఖలో రేపు, ఎల్లుండి ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు అధికారులు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ సహా పలు రహదారులు మూసివేయనున్నారు. 31 రాత్రి 8గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లై ఓవర్ మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. హనుమంతవాక నుంచి అడవివరం జంక్షన్, గోశాల జంక్షన్ నుంచి వేపగుంట, పెందుర్తి జంక్షన్ నుంచి NAD జంక్షన్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు మధ్య BRTS రోడ్డు మూసివేయనున్నారు. అటు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అండర్ పాస్ కూడా మూసివేయనున్నారు. కాగా.. ఆర్కే బీచ్ కు వచ్చే సందర్శకులు, వాహనాల పార్కింగ్ కు నిర్ధేశించిన ప్రాంతాల్లో మాత్రమే అనుమతి ఇచ్చారు.
Read Also: Shivaji: పవన్ కళ్యాణ్ సీఎం కావడం పెద్ద కష్టమేం కాదు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే.. హోటళ్లు, క్లబ్లు, పబ్ల నిర్వాహకులకు విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ. రవిశంకర్ పలు మార్గదర్శకాలను జారీ చేశారు. న్యూయర్ రోజు (అర్ధరాత్రి) ఒంటి గంట వరకు ఈవెంట్లు, కార్యక్రమాలు నిర్వహించబోవు హోటళ్లు, క్లబ్లు, పబ్ల నిర్వాహకులు ముందుగానే అనుమతి మంజూరు కోసం విశాఖ పోలీసు కమిషనర్‌కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి తీసుకోకపోతే చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్ మెంట్ చట్టం-2013 ప్రకారం నిర్వాహకులు బయటకు, లోపలికి వచ్చే మార్గాలలో, పార్కింగ్ ప్రాంతాలలో కచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్వాహకులు అలాగే మేనేజ్మెంట్ వారు బాధ్యతగా వారు నిర్వహించబోయే కార్యక్రమాల వద్ద ట్రాఫిక్, భద్రత అదుపులో ఉండేందుకు తగు సిబ్బందిని వారే నియమించుకోవాలని తెలిపారు.
Read Also: PM Modi: జనవరి 22న ఇంట్లో దీపాలు వెలిగించండి.. భక్తులకు ప్రధాని విజ్ఞప్తి