కేసీఆర్‌కు 40 లెటర్లు రాశాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఓటు వేయక పోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం.. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్‌రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతాయని వెల్లడించారు. 2 వందల బస్తీ దవాఖానలు కేంద్రం సహకారంతో నడుస్తున్నాయి… కేసీఆర్ పేరు మార్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 101 అభివృద్ధి కార్యక్రమాలు హైద్రాబాద్ పరిధిలో జరుగుతున్నాయన్నారు.
ఏపీకి వస్తున్న.. నన్ను ఆపడం ఎవరి తరం కాదు..
బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారం చేసిన వాళ్లను జైల్లో పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. తాజాగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ బెట్టింగ్ యాప్స్ కేసు రెండో కోర్టులో లిస్ట్ అయిందని.. కానీ కోర్టుకు సెలవిచ్చారన్నారు. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని, కోర్టుకు సెలవు ఇస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వాళ్లకు న్యాయం జరగాలన్నారు. బెట్టింగ్ యాప్స్ పై సీబీఐ విచారణ జరగాలన్నారు. సుప్రీంకోర్టులో బెట్టింగ్ ఆప్స్ కేసు విచారణ లిస్ట్ అయినా.. కోర్టు షట్ డౌన్ చేస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందరో బలవుతున్నారని చెప్పారు. ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు.
ప్రాణహాని ఉంది.. నాకు రక్షణ కల్పించండి..
తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పూనూరి గౌతమ్‌రెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిసేందుకు వచ్చిన పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్‌రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉండే విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగటం సరికాదు అన్నారు.. ప్రశాంతంగా ఉండే నగరాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారా..? అని మండిపడ్డారు.. నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి మరి దాడులు చేస్తున్నారు. నన్ను ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారన్న ఆయన.. దాడి చేసిన వారిని పట్టుకోవటంలో పోలీసులు విఫలమయ్యారనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.. రక్షించాల్సిన వాళ్లే భక్షిస్తున్నారు. ఇలాంటివి జరుగుతుంటే సైలెంట్ గా ఎందుకు ఉన్నారు? పోలీసుల పాత్ర కూడా ఉందా అనే అనుమానం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు..
వరద ముప్పు తప్పించిన హైడ్రాపై కాలనీవాసుల ప్రశంసలు.. ప్లకార్డులతో మానవహారం..!
వరద ముప్పు తప్పించిన హైడ్రాకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. అభినందనల ప్లకార్డులతో అమీర్‌పేట, ప్యాట్నీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. మైత్రివనం వద్ద హైడ్రాకు మద్దతుగా మానవహారం కార్యక్రమం చేపట్టారు. 5 సెంటీమీటర్ల వర్షానికే మునిగిపోయే కాలనీలకు హైడ్రా ఉపశమనం కల్పించిందన్నారు. 15 సెంటీమీటర్ల వర్షం కురిసినా నీరు నిలవలేదని నివాసితుల ఆనందం వ్యక్తం చేశారు.. అమీర్‌పేట, శ్రీనివాస్‌నగర్, గాయత్రినగర్, కృష్ణనగర్, అంబేద్కర్‌నగర్ ప్రజలు హైడ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. భూగర్భ పైపులైన్లలో పూడిక తీయడంతో డ్రైనేజీ సమస్యలు తీరాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్షంగా పర్యటించి బాధ్యతలు హైడ్రాకు అప్పగించారని స్థానికులు చెప్పారు..
వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ..!
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూటమి సర్కార్, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఈ వ్యవహారంలో మరోసారి సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని ఆరోపించారు.. అసలు చంద్రబాబు చేసింది ఏముంది? అని నిలదీశారు.. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైయస్సార్‌సీపీ.. అదానీ-గూగుల్‌కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉంది. మనం ఇక్కడ కూడా భూములు ఇచ్చాం, అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఆ రోజు అడుగులు వేశాం కాబట్టి.. ఇప్పుడు గూగుల్ వస్తోందన్నారు.. మూలపేట ప్రారంభించి మనం కట్టుకుంటూ వెళ్లాం కాబట్టి ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతోంది.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి మనం శరవేగంగా నిర్మాణాలు చేశాం.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రపు పని.. మంచి చేయకపోగా, చెడు చేస్తున్నాడు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..
డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి.. నిందితులపై బుల్డోజర్లు ఎక్కిస్తామని వార్నింగ్..
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ గురువారం జరుగుతోంది. అయితే, రాష్ట్రంలోని లఖిసరై జిల్లాలో పోలింగ్ రోజున ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో, ఆవు పేడతో, చెప్పులతో దాడులు చేశారు. లఖిసరై నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే అయిన సిన్హా, ఖోరియారి గ్రామాన్ని సందర్శించకుండా అడ్డుకునేందుకు ఆర్జేడీ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు బీజేపీ ఆరోపించింది. అనేక మంది సిన్హా కారును అడ్డుకుని ‘‘ముర్దాబాద్’’ అంటూ నినాదాలు చేశారు. గ్రామంలోకి ప్రవేశించకుడా ఆపేశారు.
జగద్గిరిగుట్టలో రౌడీషీటర్‌పై దారుణ హత్య.. ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణ హత్య చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రౌడీ షీటర్ రోషన్ సింగ్ (25)ను మరో రౌడీషీటర్ బాలశౌ రెడ్డి, అతని అనుచరులు ఆదిల్, మహమ్మద్‌లు కలిసి కత్తులతో దారుణంగా నరికి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు బులెట్ బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. సుమారు 15 రోజుల క్రితం రోషన్ సింగ్, మరో ఆరుగురు మిత్రులు కలిసి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ ట్రాన్స్‌జెండర్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై బాధితుడు బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
బస్సు ప్రమాదాలు, తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న బస్సు ప్రమాదాలు, తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా విషాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ఇలాంటి ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీని వినియోగించుకోవాలి. టెక్నాలజీ అందుబాటులో ఉంటే కనీసం కొంతవరకు ప్రమాదాలను అరికట్టవచ్చు” అని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు ఇటీవల జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ, దానికి సంబంధించి ఉన్న సాంకేతిక, పాలసీ లోపాలపై దృష్టి సారించారు.
ఏపీ సర్కార్ సంచలనం.. గ్రామ సచివాలయాల పేరు మార్పు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయాల వ్యవస్థకు కొత్త రూపురేఖలు ఇవ్వడానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్రామ సచివాలయాలకు కొత్త పేరు పెట్టే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇకపై వాటిని “విజన్ యూనిట్స్” (Vision Units)గా పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జరిగిన మంత్రులు, అధికారుల సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ, “గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే విధంగా రూపకల్పన చేయాలి. అందుకే వాటిని విజన్ యూనిట్స్‌గా మార్చుతున్నాం. ఇవి భవిష్యత్తులో ప్రజా సేవలకు కేంద్ర బిందువుగా నిలుస్తాయి” అని చెప్పారు. ఇకపై ఈ విజన్ యూనిట్స్ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థంగా అందించేందుకు ప్రత్యేక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పౌరులకు అవసరమైన సంక్షేమ పథకాలు, రికార్డులు, సర్టిఫికేట్లు, ప్రభుత్వ సహాయ పథకాలను ఒకే వేదికపై అందించే విధంగా ఈ యూనిట్స్ పని చేయనున్నాయి. సీఎం చంద్రబాబు విజన్ యూనిట్స్ రాష్ట్ర భవిష్యత్ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామస్థాయి పాలనను ఆధునిక సాంకేతికతతో మిళితం చేస్తామని తెలిపారు.