Vakati Narayana Reddy: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డిని నకిలీ సీబీఐ అధికారులు బెంబేలెత్తించారు. ముంబైలోని సీబీఐ అధికారులుగా చెబుతూ 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఇదివరకే వాకాటిపై సీబీఐ కేసులు ఉండటంతో ఆయనకు కొంత అవగాహన ఉంది. దీంతో ఆయన గట్టిగా సమాధానం చెప్పినప్పటికీ.. వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. థాయిలాండ్‌కు పంపిన పార్సెల్‌లో మాదకద్రవ్యాలు.. విదేశీ కరెన్సీ దొరికాయని.. మీ ఆధార్ కార్డు వివరాలతోనే ఈ పార్సెల్ వెళ్లిందని చెప్పారు. తాను ఎలాంటి పార్సెల్ పంపలేదని నారాయణరెడ్డి చెప్పడంతో ఈ విషయాన్ని ముంబైలోని సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read Also: Iran Nuclear Tests: భూగర్భంలో అణు పరీక్షలు చేస్తున్న ఇరాన్..? ఇజ్రాయెల్పై దాడికి ప్లాన్..!
అంతేకాక ముంబై సెంట్రల్ క్రైమ్ అధికారులతో మాట్లాడాలని నకిలీ కేటుగాళ్లు వాట్సాప్ కాల్‌లో చెప్పారు. తాను నిజంగానే అధికారులతో మాట్లాడుతున్నట్టు భావించిన నారాయణరెడ్డి తనకు వచ్చిన కాల్స్ వివరాలను వారికి తెలిపారు. వాట్సాప్ కాల్ ద్వారా నారాయణ రెడ్డి వివరాలను తీసుకున్నారు. ఆధార్ కార్డుతో పాటు.. మరిన్ని వివరాలను సేకరించిన నకిలీ అధికారులు.. మనీలాండరింగ్ కేసు ఉందని చెప్పారు. తనపై ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన కేసులు కోర్టులో నడుస్తున్నాయని వాకాటి సమాధానం చెప్పినా.. తాము పూర్తిస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతవరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని నాలుగు రోజులపాటు నిఘా పేరుతో వాకాటిని సెల్ఫ్ కస్టడీలో ఉంచారు.
Read Also: Pithapuram Crime: పిఠాపురంలో దారుణం.. మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారం.. ఆపై..!
అప్పటి నుంచి ఆరు రోజులు పాటు వాకాటితో మాట్లాడుతూ ఇబ్బందులు గురి చేశారు. ఒక్కో రోజు.. ఒకో అధికారి పేరుతో పలువురు వాట్సప్ కాల్ లోకి వచ్చి.. ఫ్రీజ్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలను నారాయణ రెడ్డికి చెప్పారు. తాము అరెస్టు చేయకుండా ఉండాలంటే 15 కోట్ల రూపాయలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని చెప్పడంతో వాకాటికి అనుమానం వచ్చింది. తాను డబ్బులు ఇవ్వలేనని స్పష్టం చేయడంతో నకిలీ అధికారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో.. అనుమానం వచ్చిన నారాయణరెడ్డి ఈ విషయంపై నెల్లూరులోని వేదయపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముంబై నుంచి వచ్చిన కాల్స్ వివరాలను సేకరించి విచారణ ప్రారంభించారు.