Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ స్లోగన్ ఒకటే జగన్‌ను గెలవనీయం అంటాడని.. మమ్మల్ని గెలిపించేది, ఓడించేది ప్రజలు అని.. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే తమపై పవన్ విమర్శలు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్‌పై విద్వేషం తప్ప పవన్ ప్రసంగంలో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చుతానని పవన్ పదే పదే అంటున్నాడని మండిపడ్డారు. పవన్‌ను నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని చెప్పారు. ప్రధానితో భేటీపై రోజుకో మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధానితో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడితే తమకెందుకు అని పేర్ని నాని అన్నారు.
Read Also: Chhattisgarh: వీళ్లు మనుషులు కాదు.. అక్కా చెల్లిళ్లపై తండ్రి, మేనమామ లైంగిక వేధింపులు
ప్రధాని మోదీని వైజాగ్‌లో కలిసొచ్చిన తర్వాత.. 2014 తర్వాత ప్రధానిని కలిసి 8 ఏళ్ళు అయ్యిందని పవన్ కళ్యాణ్ చెప్పాడని.. ఇవాళేమో 2014 తర్వాత వివిధ సందర్భాల్లో ప్రధానిని కలిశానంటాడని.. అసలు ఏది నిజమని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మోదీతో ఏం మాట్లాడావో అని టెన్షన్ పడుతున్న చంద్రబాబుకు చెవిలో చెప్పాలని పవన్‌కు హితవు పలికారు. చంద్రబాబు, పవన్ కలిసి ఏం మాట్లాడుకున్నా, కలిసి దొర్లినా తమకేం ఇబ్బంది లేదన్నారు. 2014లో వైసీపీకి 60 సీట్లు, 2019లో 151 సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ నోట్లో వేలు పెట్టుకుని చూశాడని.. అలాగే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు వచ్చినా నోట్లో వేలు పెట్టుకుని చూడక తప్పదన్నారు. పవన్ కళ్యాణ్ మాకు మద్దతు ఇవ్వాలని అడుగుతున్నాడని.. మాకు అంటే ఎవరెవరో చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ విధివిధానాలు చూసి ఓటేయమంటే ఎవరూ వేయరన్నారు. జనసేన కార్యకర్తల కష్టాలు పగవారికి కూడా రాకూడదన్నారు. ఎన్ని పార్టీల జెండాలు పట్టుకుని మోయాలో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.
ఓబీసీ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారో కూడా పవన్ కళ్యాణ్ అవగాహన లేదా అని పేర్ని నాని ప్రశ్నించారు. దేశంలో ఏ ప్రాంతంలోని ఏ కులం ఓబీసీ కిందకు వస్తుందో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేది ఎవరో తెలియదా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ కిరాయి విప్లవ సేన అని పేర్ని నాని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ కార్యకర్తలను రెచ్చగొట్టి తప్పుదారి పట్టిస్తున్నాడని.. పవన్ కళ్యాణ్ చొక్కా మార్చినంత తేలిగ్గా మాట మారుస్తాడని మండిపడ్డారు. చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామోజీరావు అని.. జనరల్ సెక్రటరీ పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా మద్యం ఉండకూడదు… రామోజీ ఫిల్మ్ సిటీలో మాత్రమే ఉండాలని రామోజీరావు అనుకుంటాడని.. అక్కడే నైట్ లైఫ్ ఉండాలి.. బెల్లీ డ్యాన్సులు ఉండాలి.. ఇదీ వారి కోరిక అని పేర్ని నాని విమర్శలు చేశారు.