Margani Bharat: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్లు చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్.. అసలు పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబు అజెండా మోసుకుని ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళాడా..? లేదా వాళ్లే పిలిచారా..? అనే విషయం తెలియాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరిలో విశ్వసనీయత అనేది లేదని విమర్శించిన ఆయన.. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్‌ను మిత్రపక్షంగా గెలిపించే ప్రయత్నం కూడా జనసేన చేయకపోవటం విచిత్రమని వ్యాఖ్యానించారు.. ఇదెక్కడ పొత్తని మాధవ్ కూడా బాధపడ్డారని తెలిపారు. రాజమండ్రిలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దలు పవన్ కల్యాణ్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని జనం అనుకుంటున్నారని అన్నారు.. తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దని సూచించారు. ఇక, పవన్ ఢిల్లీలో చేసే పనులన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయని కామెంట్ చేశారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్.. టార్గెట్ ఇదే..!
మిత్ర ధర్మం పాటించని మిమ్మల్ని ఢిల్లీ పెద్దలు ఎందుకు గౌరవిస్తారని పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించారు ఎంపీ భరత్.. మూడు రోజుల నుంచి ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నాడు.. ఇది దేనికోసమో ప్రజల ఆలోచించాలని అన్నారు. గతంలో పాచిపోయిన లడ్డూలు అని చెప్పి బీజేపీ పెద్దలతో చెప్పిన పవన్ కల్యాణ్.. మళ్లీ ఏ సఖ్యత కోసం ఢిల్లీ వెళ్లారో తెలపాలని డిమాండ్ చేశారు. పవన్ రెండు రోజులు కనబడితే మూడు రోజులు కనబడడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించరు.. ఆయనపై ఏ మాత్రం ప్రజలకు నమ్మకం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అంటున్నారని, ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లబోతున్నామని తెలిపారు.
Read Also: Shikhar Dhawan: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధవన్.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్
ఇక, రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు ఎంపీ భరత్.. రాష్ట్రంలో 87 శాతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. డీబీటీ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారని వెల్లడించారు.. కానీ, చంద్రబాబు హయాంలో ఏ రకమైన అభివృద్ధి పనులు, సంక్షేమక పథకాలు కూడా అమలు జరగలేదని విమర్శించారు.. 2024 ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వదిస్తే వైఎస్ జగన్.. మరోసారి ముఖ్యమంత్రి అవుతారు.. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రం కూడా మారుతుందని ప్రకటించారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్.