Gudivada Amarnath: విశాఖలో రాండ్ స్టాడ్ రిక్రూట్‌మెంట్ కంపెనీని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాండ్ స్టాడ్ లాంటి గ్లోబల్ ఎక్స్‌పోజర్ ఉన్న కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయంటే భవిష్యత్‌ను అర్ధం చేసుకోవచ్చన్నారు. విశాఖ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రఖ్యాత సంస్థలన్నీ విశాఖకు తరలివస్తుండటం సానుకూల సంకేతమని మంత్రి అమర్నాథ్ అన్నారు. జనవరి నుంచి ఇన్ఫోసిస్ కంపెనీ కార్యకలాపాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: ఒకే ఫ్రేములో వైసీపీ, టీడీపీ ఎంపీలు.. వైరల్ అవుతున్న ఫోటోలు
అటు దేశంలోనే విశాఖ నగరం ఐటీ హబ్‌గా మారబోతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు. ర్యాండ్ స్టాడ్ వంటి కంపెనీ రాకతో విశాఖలో ఐటీ రంగానికి బూస్ట్ అప్ అందుతుందని అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో రాండ్ స్టాడ్ కంపెనీ ద్వారా ఆరువేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా విశాఖలో ఐటీ అభివృద్ధికి కృషి చేస్తోందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ టౌన్ నినాదంతో వెళ్తోందని.. ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు జరుగుతోందని వివరించారు. పెద్ద వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. ప్రపంచంలో ప్రతి వంద మంది ఐటీ ఉద్యోగుల్లో 20 మంది భారతీయులు ఉన్నారని.. ర్యాండ్ స్టాడ్ రాక విశాఖ నగర అభివృద్ధిలో పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.