Andhra Pradesh: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో అంతర్జాతీయ విమాన సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా విజయవాడ-షార్జా మధ్య రాకపోకలు కూడా ప్రారంభం కావడంతో షార్జా నుంచి విమానం గన్నవరం చేరుకుంది. షార్జా వెళ్లే విమాన సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి… టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేశారు. సాయంత్రం 6:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం షార్జాకు బయలుదేరింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రతి సోమవారం, శనివారం షార్జాకు నేరుగా విమాన సేవలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాగా ఒకే ఫ్రేములో వైసీపీ, టీడీపీ ఎంపీలు ఉండటంతో పలువురు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
గన్నవరం నుంచి షార్జాకు విమాన సేవలు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని వైసీపీ ఎంపీ బాలశౌరి వెల్లడించారు. స్థానిక పార్లమెంటు సభ్యునిగా, ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా అనేక సార్లు అంతర్జాతీయ విమాన సేవల కోసం ప్రయత్నాలు చేశానని తెలిపారు. చివరకు తమ ప్రయత్నం ఫలించిందని.. భవిష్యత్‌లో గన్నవరం నుంచి సింగపూర్, థాయ్‌లాండ్, బ్యాంకాక్‌కు విమానాలు నడిచేలా ప్రయత్నిస్తామని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. షార్జా విమానానికి రద్దీ పెరిగితే ప్రతిరోజూ ఈ సర్వీసు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అటు టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. 2014కు ముందు గన్నవరం ఎయిర్‌పోర్టు బస్టాండ్ కంటే హీనంగా ఉండేదని.. అలాంటి ఎయిర్‌పోర్టులో ఇప్పుడు షార్జాకు విమాన సేవలు ప్రారంభం కావడం శుభపరిణామం అని తెలిపారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఎయిర్‌పోర్టు ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు. గన్నవరం ఎయిర్‌పోర్టు అభివృద్ధి చేసిన క్రెడిట్ చంద్రబాబు, అప్పటి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజులదేనని పేర్కొన్నారు. తనకు టాటా సంస్థలతో ఉన్న రిలేషన్స్‌తో మరిన్ని అంతర్జాతీయ విమానాలు విజయవాడ నుంచి తిరిగేలా కృషి చేస్తానని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.
At the ceremonial launch of Air India Express flight from Vijayawada to Sharjah at Gannavaram Airport. pic.twitter.com/tYoN02kWSp
— Journey with Jogu (@JogulambaV) October 31, 2022