Dadisetti Raja: ఈనెల 15 నుంచి ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో వైసీపీ నేతలు విమర్శలు చేశారు. కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రజాగర్జన డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని.. వారిలో ఒక్కరు గెలిచినా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. అమరావతి పేరు చెప్పి తన బినామీలతో లక్షల కోట్లు దోచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రణాళికలో భాగంగానే రథయాత్రలు, పాదయాత్రలు చేస్తున్నారని.. పవన్ అహంకారంతో మాట్లాడుతున్నారని.. ఐదు కోట్ల మందికి వారి భావనను తెలియపరచుకునే హక్కు లేదా అని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ప్యాకేజీ తీసుకుని ఆయన మాత్రమే బాగుంటే సరిపోతుందా అని నిలదీశారు. ప్రజలు పవన్ డైవర్షన్ పాలిటిక్స్ గమనిస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి చెప్పు దెబ్బ లాంటి తీర్పు పవన్‌కు ఇచ్చారని.. అయినా సిగ్గులేకుండా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ప్రవచనాలు చెప్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు.
Read Also: AP High Court: మేము కూడా ‘బిగ్‌బాస్’ చూస్తాం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మరోవైపు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. విశాఖలో పవన్ కళ్యాణ్ జనవాణి వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టిని మళ్లించే చర్యలు మానుకోవాలని హితవు పలికారు.గాజువాకలో ఓడిపోయినా రెండో స్థానం కల్పించిన ఈ ప్రాంతంలోని ఓటర్ల మనోభావాన్ని పవన్ గుర్తించాలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆకాంక్షించే రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలని అవంతి శ్రీనివాస్ తెలిపారు. వికేంద్రీకరణ పోరాటాన్ని లీడ్ తీసుకుంటామని ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చినా పక్కకు తప్పుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. వికేంద్రీకరణ ఉద్యమం ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం పోరాటం అని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.