YSRCP: ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీ నేతలు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారట. నియోజకవర్గ ఇంఛార్జ్‌లుగా ఉన్న నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న గ్రామ, మండల, జిల్లా స్థాయి పదవులను భర్తీ చేయటంపై ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. త్వరలో జిల్లా పర్యటనలు చేస్తానని స్వయంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పటంతో పార్టీ అధిష్టానం పార్టీ పదవులను భర్తీ చేయటంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా జిల్లా నేతలు కూడా తమ పరిధిలో ఉన్న పార్టీ పదవులను భర్తీ చేయటానికి చూడగా కొందరు సుముఖత వ్యక్తం చేయటం లేదనే విషయాన్ని పార్టీ నేతలు గుర్తించారట. కూటమి ప్రభుత్వం దూకుడుకి ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లలో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. దీంతో జిల్లా మొత్తంగా కూడా కూటమి నేతల హవానే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పార్టీ కీలక నేతలపై కేసులు నమోదు కావటం, కొందరు నేతలు అసలు అందుబాటులో లేకుండా ఉంటున్న నేపధ్యంలో కూడా పార్టీ పదవులను తీసుకోవటానికి ఆలోచన చేస్తున్న పరిస్థితి వచ్చిందని లోకల్ టాక్.
Read Also: Tirumala: తిరుమలలో దంపతుల ఆత్మహత్య కలకలం..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఓ మాజీ మంత్రి పోటీ చేసి ఓడిన నియోజకవర్గంలో ఇప్పుడు కొత్తగా ఓ నేతకు జగన్ ఇంఛార్జ్ పదవిని ఇచ్చారు. ఆయన తన నియోజకవర్గంలో పదవులను భర్తీ చేయటానికి ప్రయత్నాలు చేస్తుంటే ఎక్కువ మంది ఆలోచించి చెబుతామని చెప్పారట. దీంతో ఎవరైనా ఆసక్తి కనబరిస్తే వారికి ఆ పదవులను ఇస్తున్నారట. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో పాటు కొత్తగా పార్టీ పదవులను తీసుకుంటే వారిపై కొత్తగా ఏమైనా కేసులు పెట్టడం లేదా, ఆర్థికంగా ఇబ్బందులు కలిగిస్తారనే ఆందోళనతో కూడా పార్టీ పదవులను తీసుకోవటానికి అయిష్టత చూపిస్తున్నారని నేతలు గుర్తించారట. అయితే జగన్ పర్యటనల నాటికి పూర్తి స్థాయిలో పదవుల భర్తీని ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంగా నేతలు కూడా ముందుకు వెళ్తున్నారట.
Read Also: Delhi Elections: 2015, 2020లో బీజేపీ గ్రాఫ్ ఇది.. 2025 బిగ్ ఛేంజ్ అవుతుందా?
కూటమి అధికారంలోకి రావటానికి ముందు వచ్చిన తర్వాత కొందరు కీలక నేతలు జిల్లాలో వైసీపీని వీడారు. వైసీపీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్, పార్ధసారథి, ఎంపీగా గెలిచిన ఎంపీ బాలసౌరి ఎన్నికల ముందు పార్టీ మారారు. యార్లగడ్డ వెంకట్రావు, బెజవాడ వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవ కుమార్‌లు ఎన్నికల ముందు పార్టీ మారారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సామినేని ఉదయభాను జనసేనలో చేరారు. దీంతో ఈ నేతలతో పాటు క్యాడర్ కొంత క్యాడర్ కూడా పార్టీ మారింది. దీంతో ఇంఛార్జ్‌ల మార్పు చేర్పులు కూడా చేసిన అధిష్టానం ఇక మండల, గ్రామ, నియోజకవర్గ స్థాయి పదవుల భర్తీ చేయటమే మిగిలి ఉంది. ఇందులో కూడా చాలా వరకు పదవులను భర్తీ చేసిన నేతలు ఇకపై పూర్తి స్థాయిలో జగన్ పర్యటనలతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాల్సి ఉంటుంది.. కాబట్టి అన్ని పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని అధిష్టానం ఆదేశాలతో కదిలారట. అయితే, పదవులను తీసుకోవటానికి కొందరు ఆనాసక్తి చూపిన వారిని పక్కన పెట్టి వేరే వారికి పదవులు ఇచ్చి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు భరోసాగా ఉండటంతోపాటు వచ్చిన తర్వాత కూడా పార్టీ న్యాయం చేస్తుందని చెబుతున్నారట నేతలు.