కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఓదార్పు యాత్ర చేయవద్దన్న పార్టీని తాను వ్యతిరేకించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలను తనపై ఉసిగొల్పాయని.. అన్యాయమైన ఆరోపణలు చేయించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారన్నారు. ఆనాడు వాళ్లకు లొంగిపోయి ఉంటే ఈనాడు జగన్ మీ ముందు ఇలా ఉండేవాడు కాదని వ్యాఖ్యానించారు. తనను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి జగన్ మండిపడ్డారు. గతంలో ఎన్నికల తర్వాత టీడీపీ మేనిఫెస్టో కనిపించకుండా చేశారని.. కానీ తాము పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని.. జగన్ చెప్పింది నిజమని నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయాలని ప్లీనరీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో సెల్‌ఫోన్ లైట్లతో ఆపరేషన్‌లు చేసిన ఘటనలు చూశామని.. ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు కొరికిన ఘటనలు చూశామని.. తాము నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చామని జగన్ తెలిపారు.
Read Also: Y. S. Sharmila : కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు? సమీకరణాలు మారుతున్నాయా..? |
ఆనాడు ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు 151కి, ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం 22కి చేరిందని సీఎం జగన్ అన్నారు. 2014 ఎన్నికల్లో 1 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయామని చెప్పారు. అప్పుడు తమ 23 మంది ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా టీడీపీ కొనుగోలు చేసిందని, 2019లో ఆ పార్టీకి అవే సంఖ్యలో సీట్లు వచ్చాయని తెలిపారు. టీడీపీ లాగా తాను ఎమ్మెల్యేలను కొనడంపై దృష్టి పెట్టలేదని, తన ఫోకస్ అంతా ప్రజల మంచి కోసమేనని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారని.. పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలనడం విడ్డూరమని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఎదగకూడదన్నదే చంద్రబాబు విధానమని ఆరోపించారు. నారాయణ, చైతన్య స్కూళ్ల కోసం చంద్రబాబు శ్రమిస్తారని.. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లడం కోసం తాము శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క విద్యా రంగంలో 9 పథకాలను అమలు చేశామని.. అమ్మఒడి ద్వారా ఇప్పటివరకు రూ.19,617 కోట్లు ఇచ్చామని జగన్ వెల్లడించారు.