తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారతాయా..?కాంగ్రెస్, షర్మిల పార్టీ పొత్తు పెట్టుకుంటాయా..?
వైఎస్ ఆశయాల కోసం కలిసి పనిచేస్తాయా..?రెడ్డి సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకుంటాయా..?టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బలమైన కూటమి వస్తుందా..?
కొత్త కూటమి..!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మారుతున్న పరిణామాలు చూస్తే.. కాంగ్రెస్, షర్మిల పార్టీతో అవగాహన కుదుర్చుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. వైఎస్, రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తే.. టీఆర్ఎస్ కు గట్టి ఫైట్ ఇవ్వొచ్చనే ఆలోచన మొదలైంది. అవసరమైతే లెఫ్ట్ పార్టీల్ని కలుపుకుని 2004 తరహా కూటమి ఏర్పాటైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తోంది.
వైఎస్సార్ జయంతి సందర్భంగా ఏపీలో వైసీపీ ప్లీనరీ జరుగుతుంటే.. తెలంగాణలో కొత్త పొత్తుల చర్చ జరుగుతోంది. వైఎస్ ఆశయాల సాధన పేరుతో కాంగ్రెస్, షర్మిల పార్టీ కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో ఏడాదిలో ఎన్నికలున్నాయి. ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల, కాంగ్రెస నేతలు చేసిన పరోక్ష వ్యాఖ్యలు కొత్త కూటమి వస్తుందా అనే అనుమానాలకు తావిస్తున్నాయి. రాహుల్ ను ప్రధాని చేయడం వైఎస్ ఆశయమని, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్. ఈ స్టేట్ మెంట్ పైకి మామూలుగానే ఉన్నా.. లోపాయికారీగా షర్మిల పార్టీతో పొత్తుక హింట్ ఇచ్చినట్టుగా ఉందనే వాదన ఉంది. షర్మిల కూడా కేవలం టీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్ పై విమర్శలు చేయకపోవడం వీటికి మరింత బలం చేకూరుస్తోంది. కాంగ్రెస్ తమ కుటుంబానికి అన్యాయం చేసిందని గతంలో వైసీపీ తరపున తెలంగాణలో పాదయాత్ర చేసిన షర్మిల.. ఇప్పుడు ఆ ఊసు పెద్దగా ఎత్తడం లేదు. కాంగ్రెస్ నేతలు కూడా మొదట్లో తప్ప షర్మిలపై విమర్శలు చేయడం లేదు. ఇవన్నీ రెండు పార్టీల మధ్య లోపాయికారీ అవగాహన ఉందనే వార్తలకు ఊతమిస్తున్నాయి.
షర్మిల పార్టీ పెట్టి ఏడాది పూర‌్తైంది. రెండు విడతలుగా 1500 కి.మీ పాదయాత్ర చేశారు. రాజకీయ లబ్ధి వస్తుందా.. లేదా అనే సంగతి పట్టించుకోకుండా వీలైనంత ఎక్కువ నియోజకర్గాలు కవర్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. షర్మిల పాదయాత్రపై జనంలో కూడా చర్చ జరిగే పరస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీకి సిద్ధమని షర్మిల ప్రకటించడంతో.. ఆమె ప్రభావం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంటుందనే చర్చ నడుస్తోంది. 2014 ఎన్నికల్లో కూడా వైసీపీ ఖమ్మంలో మంచి ఫలితాలు సాధించింది. ఈ తరుణంలో షర్మిలతో పొత్తుకు ప్రతిపక్షాలు ఆసక్తిగా ఉండొచ్చనే వాదన కూడా ఉంది.
మొన్నటివరకూ సింగిల్ గా నిరసలు, ధర్నాలు చేసిన షర్మిల పార్టీ.. తొలిసారి ఆమ్నీషియా పబ్ రేప్ తర్వాత కాంగ్రెస్ నిర్వహించిన అఖిల పక్షానికి హాజరైంది. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ అనే పేరు గతంలో ఉన్నా.. ఇప్పుడు ఆ సామాజికవర్గం టీఆర్ఎస్ తో ఉన్నట్టు భావిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం, వైఎస్ ఓటుబ్యాంకును కూడగట్టాలంటే ఇద్దరం కలవాలని రెండు పార్టీలు అనుకునే అవకాశం లేకపోలేదు.
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా యాంటీ బీజేపీ కూటమి ఉండాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి చివరకు ఏ రూపు తీసుకుంటాయనేది చూడాల్సి ఉంది. కచ్చితంగా ఆరు నెలల్లో సమీకరణాలు మారతాయన్న షర్మిల చిట్ చాట్ పై కూడా చర్చ జరుగుతోంది. పొత్తులు ఉండవంటున్నా.. కాదంటే ఔననే అర్థాలు ఉండొచ్చంటున్నారు. వైసీపీ ప్లీనరీలో విజయమ్మ ప్రసంగం కూడా తెలంగాణపై షర్మిల సీరియస్ గా దృష్టి పెడుతున్నారనే సంకేతం ఇచ్చింది. హైదరాబాద్ లో వైఎస్ స్మృతివనం ఉండాలన్న కోరిక కూడా చర్చనీయాంశమైంది. వైఎస్ మెమోరియల్ కు ఇచ్చిన స్థలాన్ని కేసీఆర్ వెనక్కితీసుకుని అవమానించారన్న ఘాటు విమర్శలు.. వైఎస్ అభిమానుల్ని టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏకం చేసే సూచనలున్నాయ. ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకీ కలిసొస్తాయనే అభిప్రాయాలున్నాయి. వైఎస్ తమ పార్టీ సీఎం అనే కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ఈ పరిణామాలన్నీ ఎన్నికల నాటికి కొత్త కూటమి దిశగా వెళ్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
షర్మిల పార్టీ పెట్టినప్పట్నుంటే కాంగ్రెస్ తో పొత్తుపై చర్చ జరుగుతోంది. అయితే ఈ వార్తల్ని రెండు పార్టీలూ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాయి. కానీ సరిగ్గా ఎన్నికల ముందు మరోసారి ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, వైఎస్సార్టీపీ.. ఇలా చాలా పార్టీలున్నాయి. ప్రతిపక్షాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన నేత షర్మిల మాత్రమే. ఎన్నికల వరకూ ప్రజల్లోనే ఉండాలనే సంకల్పం ఆమెలో కనిపిస్తోంది. కేసీఆర్పై షర్మిల విమర్శలు కూడా రోజురోజుకీ పదునెక్కుతున్నాయి. కొన్ని అంశాల్లో అనుకోకుండా కాంగ్రెస్, షర్మిల ఒకే లైన్ తీసgకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇది యాదృచ్ఛికమే అయినా.. భవిష్యత్ పొత్తులకు సంకేతం కూడా కావచ్చనే విశ్లేషణలు ఉన్నాయి.
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం ప్రతిపక్షాల మధ్య పోటీ ఉంది. అయితే టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం ఏది అనేది ఓటర్లకు ఇంకా ప్రశ్నగానే ఉంది. కానీ ఈసారి దీనికి సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్, షర్మిల పార్టీ రెండూ గట్టిగా ఫిక్సైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు వైఎస్, రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంకు తోడైతే.. గెలుపు కష్టం కాదనే లెక్కలున్నాయి. ఈ ప్లాన్ వర్కవుట్ కావాలంటే.. రెండు పార్టీల మధ్య ఏదో స్థాయిలో అవగాహన ఉండాలనే వాదన ఉంది.
పొత్తులు ఉండవని షర్మిల స్టేట్ మెంట్లు ఇస్తున్నా.. లోపాయికారీగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మారుతున్న పరిస్థితులు, పరిణామాలు దేనికైనా దారితీయొచ్చు. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్కు.. వైఎస్సార్ ఆశయ సాధన పేరుతో షర్మిల తోడైతే.. పోలింగ్ బూత్ లెక్కలు మారతాయనే అంచనాలున్నాయి. మరి రెండు పార్టీలు భవిష్యత్తులో ఎలాంటి రాజకీయం చేస్తాయో చూడాల్సి ఉంది.
2024లో 2004 తరహా పొత్తులకు తెర లేస్తోందా.. ? కేసీఆర్ ను గద్దె దింపడానికి కొత్త కూటములు తెరపైకి వస్తాయా.. ? అంటే పూర్తిగా కొట్టిపారేయలేని స్థితి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మహాకూటమి తరహా ప్రయత్నం చేసింది. అయితే టీడీపీతో పొత్తు వర్కవుట్ కాలేదు. ఇక్కడ నాన్ సింక్ పొత్తే కొంప ముంచిందనే వాదన ఉంది.ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా షర్మిల పార్టీని సింక్ చేసుకుని.. పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే రెండు వైపులా పరస్పర విమర్శలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. వైఎస్ పేరు చెబితే ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్ క్రియేట్ అవుతుందనే నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణలో వైఎస్ పథకాల లబ్దిదారులు అధిక సంఖ్యలో ఉండటం.. షర్మిల అందరికీ పరిచితురాలు కావడం కలిసొస్తుందని కాంగ్రెస్ లెక్కలేస్తోంది. షర్మిల కూడా ఉన్న ఆప్షన్స్ లో కాంగ్రెస్ తో వెళ్లడమే మేలని భావించే అవకాశాలున్నాయి. సామాజికవర్గం, వైఎస్ నేపథ్యం పరంగా కూడా ఆ పార్టీ సరైందనే భావనతో ఉండొచ్చు. అదే జరిగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ అంతో ఇంతో బలపడే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల నాటికి మరింత బలం పుంజుకునే వ్యూహాలు రచిస్తోంది. ఈలోగా షర్మిల పాదయాత్రకు వచ్చే ఆదరణ కూడా తోడైతే.. ఏమైనా జరగొచ్చనే అంచనాలున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. కానీ ఏ కూటమి అయినా కచ్చితంగా ఏర్పడదనే లెక్కలేం ఉండవు. అవసరం, అవకాశం, సందర్భం కలిసొస్తే.. కాంగ్రెస్, వైఎస్సార్టీపీ ఎన్నికల ముందో.. తర్వాతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయి. అసలు పార్టీ పెట్టకముందే ఆత్మీయ సమావేశాల పేరుతో షర్మిల.. వైఎస్ తో పనిచేసిన కాంగ్రెస్ నేతల్ని ఆహ్వానించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.