తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లోకేష్ ను తిడుతున్నట్టుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీ క్యాడర్‌ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని ఒక టీడీపీ నేత.. అచ్చెన్నాయుడు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ.. ‘ఆయనే సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ‘పార్టీ లేదు.. ఏమీ లేదు’ అంటూ టీడీపీ నేతకు వత్తాసు పలికారు. అయితే ఇది లోకేష్ ను ఉద్దేశించి అన్నదేనని ప్రచారం చేస్తున్నారు అధికార పక్ష కార్యకర్తలు.
అయితే ఈ వీడియో పై అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్‌తో తనకున్న అనుబంధాన్ని విడదీయలేవని వైఎస్ జగన్‌పై అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐకమత్యంతో పనిచేస్తున్నామని, జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇక ఈ అంశం మీద మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు లోకేష్ గురించి నిజం మాట్లాడాడన్న ఆయన రోజు మేము మీడియా ముందు మాట్లాడేది నాలుగు గోడల మధ్య చెప్పారని అన్నారు. అచ్చెన్నాయుడు మీడియా ముందు మాట్లాడలేడు కాబట్టి టీడీపీ నాయకుడుతో మాట్లాడారని అన్నారు. అచ్చెన్నాయుడు చెప్పింది నేనైతే నిజమే అనుకుంటున్నానని అన్నారు.
చంద్రబాబు జిమ్మిక్కులు
తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు అనేక జిమ్మిక్కులు చేస్తున్నారన్న బొత్స రాళ్ళ దాడి చేశారని కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. టీడీపీకి డిపాజిట్ దక్కదని ముందుగానే చంద్రబాబు ఊహించారని అన్నారు. అందుకే రాళ్ల దాడి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. బీజేపీ, టీడీపీ చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయని, బీజేపీతో ఉంటే తన పరిస్థితి సున్నా అని చెప్పి పవన్ కళ్యాణ్ కోరంటైన్ కి వెళ్ళిపోయారని విమర్శించారు. ఉప ఎన్నికలో 85 శాతం ఓట్లు వైసిపీకి వస్తాయన్న ఆయన వేల మందిలో ఒక రాయి ఎలా కనిపిస్తుంది ? పోలీసులు విచారణలో రాళ్ళ దాడి జరిగిన ఆధారాలు లేవని చెబుతున్నారని అన్నారు. గెలుపు ఓటములు పక్కన పెట్టిన చంద్రబాబు ఎన్నికల్లో ధైర్యంగా పోరాడాలన్న ఆయన చంద్రబాబు ధైర్యం ఉంటే తిరుపతి చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు తోక ప్రజలు ఎప్పుడో కత్తిరించారని అన్నారు.
సంక్షేమ పాలన ఎక్కడైనా ఉందా..?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలన ఎక్కడైనా ఉందా..? సీఎం జగన్మోహన్ రెడ్డి కంటే బాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నమని బీజేపీ నాయకులు చెప్పగలరా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు మాయలు ఇక పని చేయవని చంద్రబాబు నాయుడితో ప్రజలు విసిగిపోయారని అన్నారు.