CM Chandrababu: ఏపీ అసెంబ్లీ ఆవరణలో జరిగిన మాక్ అసెంబ్లీకి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో విద్యార్థులు పెర్ఫామెన్స్ బాగుంది.. రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యత.. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి.. మంత్రి లోకేష్ కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకం తెచ్చారు.. ఈ పుస్తకం లో అనేక మంచి విషయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయి, దేశ దిశ మార్చారంటే అది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం.. సాధారణ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు.. భారత రత్న పొందారు.. పవర్ ఫుల్ రాష్ట్రపతిగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇక, ద్రౌపది ముర్ము గిరిజన మహిళ ప్రస్తుతం రాష్ట్రపతి అయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. నేను కూడా సాధారణ కుటుంబంలో పుట్టి నాలుగవ సారి సీఎం అయ్యానంటే అది రాజ్యాంగం కల్పించిన అవకాశం అని చెప్పాలి.. రాజ్యాంగం హక్కులే కాదు.. విధులు కూడా ఇచ్చింది.. చాలా మంది హక్కుల కోసం పోరాటం చేస్తారు.. కానీ విధులను గురించి పట్టించుకోరు.. దేశంలో ఏ ఒక్కరూ రాజ్యాంగం కంటే గొప్పవారు కాదు.. రాజ్యాంగ స్వరూపం చాలా గొప్పది.. పార్లమెంట్, శాసన సభలు చట్టాలు చేస్తాయి.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సభకు రాకూడదు.. సమాజ హితం కోసం ప్రజాప్రతినిధులుగా రావాలని చంద్రబాబు కోరారు.
అయితే, వ్యక్తిగత కక్షల కోసం పోరాడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏ దేశానికైనా పబ్లిక్ పాలసీలు అవసరం.. 1990లో ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చాం.. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాం.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం.. నాలెడ్జ్ ఎకనామీలో తెచ్చిన ఒకే ఒక్క ఐటీ పాలసీ వల్ల తలసరి ఆదాయం పెరిగింది.. వందల దేశాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.. విదేశీయుల కంటే తలసరి ఆదాయం అధికంగా పొందుతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.
Read Also: Vikarabad: లక్కంటే వీళ్లదే..! గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్‌పాట్..
కాగా, విద్యా, ఉద్యోగాల్లో 33 శాతం ఆడ పిల్లలకు రిజర్వేషన్లు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మగవారికంటే ఆడపిల్లలు ఇప్పుడు ఎక్కువ జీతం సంపాదిస్తున్నారు.. ఆడ పిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి.. మహిళ పట్ల అవహేళనగా మాట్లాడితే ఎదుర్కోవాలి.. వెంటాడితే భయపడతారు.. ఆడ పిల్లలాగా ఏడుస్తున్నావు, గాజులు తోడుక్కుని లేమని అంటుంటారు.. ఇవన్నీ పోవాలని సూచించారు. ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలకు అవకాశం కల్పించాం.. ఆకాశమే హద్దుగా ఆడ పిల్లలు ఎదగాలి అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.