ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి… ఇవాళ కూడా సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. కల్తీ సారా మరణాలపై సీఎం వైఎస్ జగన్ సభను తప్పు దారి పట్టించారంటు స్పీకర్ పోడియం దగ్గర ఆందోళనకు దిగారు టీడీపీ సభ్యులు.. దీంతో సభ్యులను ఇవాళ ఒకరోజు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డ నారాయణస్వామి.. టీడీపీ సభ్యులకు సవాలు విసిరారు.. టీడీపీ సభ్యులు కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. రేపు మీ జాతకాలు బయట పెడతా అంటూ హెచ్చరించారు.. కాదని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు నారాయణస్వామి.
Read Also: Telangana: వారికి రైతు బంధు ఆపండి.. ఎక్సైజ్‌శాఖ లేఖ
ఇక, నారాయణస్వామి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. అంతకుముందు జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు వారించినా వారు వినలేదు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మండిపడ్డారు. ఇలాంటి సభ్యులు ఉండటం తమ ఖర్మ అంటూ సీరియస్ అయ్యారు. సభను సజావుగా సాగనివ్వడం లేదని అన్నారు. మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదిస్తూ.. 11 మంది టీడీపీ సభ్యులను ఇవాళ ఒకరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశించారు. దీంతో.. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ రావు, సాంబశివ రావు, అశోక్, భవానీ, సత్యప్రసాద్, చిన రాజప్ప, రామకృష్ణమనాయుడు, రవికుమార్, వెంకట నాయుడు, జోగేశ్వర రావు ఒకరోజు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.