International Dogs Day: కుక్క అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది విశ్వాసం. కుక్కలకు ఓ ముద్ద అన్నం పెడితే జీవితాంతం అవి మనల్ని వదలవు. వ్యక్తి, ఊరు, దేశ రక్షణలోనూ అవి తనదైన ముద్రను వేస్తున్నాయి. ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది అంటాం కదా.. అదే ఈరోజు. రెస్క్యూ డాగ్స్ ను సురక్షితమైన, వాత్సల్య వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతో కుక్కల ప్రాముఖ్యతను అందరికీ చాటిచెప్పడానికి, వాటి దత్తత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి ఏటా ఆగస్టు 26వ తేదీని అంతర్జాతీయ కుక్కల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ విధానం 2004లో ప్రారంభమైంది. 2004లో కొలీన్ పైజ్ అనే ఒక రచయిత కుక్కల దినోత్సవం జరుపుకునేందుకు బీజం వేశారు. జంతు సంక్షేమ న్యాయవాది అయిన ఆయన నేషనల్ డాగ్ డే, నేషనల్ పెట్ డే, నేషనల్ పప్పీ డే కోసం చాలా కృషి చేశారు.
శునకాలకు గ్రామ సింహం అనే పేరుంది. అంటే అడవికి సింహం ఎలాగో గ్రామాలకు కుక్కలు అలా అన్నమాట. ఎవరైనా దొంగలు గ్రామంలోకి ప్రవేశించగానే కుక్క అరుపులు వినిపిస్తాయి. అంతేకాకుండా పోలీసులకు కూడా శునకాలు ఎంతో సహాయం చేస్తున్నాయి. శునకాల ద్వారా ఎన్నో హత్య కేసులు, ఇతర కేసులను పోలీసులు చేధించిన సంఘటనలు ఉన్నాయి. కానీ కుక్కలను కొంతమంది హేళన చేస్తుంటారు. కుక్క బతుకు అంటూ నీచంగా మాట్లాడతారు. వీధి కుక్కలు అంటూ అసహనం వ్యక్తం చేస్తారు. అయితే కుక్కల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరు కూడా కుక్కను పెంచుకోవడం గ్యారంటీ. ఇటీవల పెంపుడు కుక్కల ప్రాముఖ్యతను చాటిచెప్తూ 777 చార్లీ అనే సినిమాను కూడా తెరకెక్కించారు. కుక్కలను ఎంతో అభిమానించేవాళ్లకు ఈ సినిమా ఎంతో నచ్చేసింది.
Read Also: New Super Earth: అతి పెద్దదైన భూమి.. అక్కడ ఏడాది అంటే 11 రోజులే
మీరు స్కూలుకో, కాలేజీకో లేదా ఆఫీసుకో ఏదైనా వేరేచోటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక మీలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపేందుకు ఎదురుచూసే ఏకైక జంతువు మీ శునకం .కుక్కతో కాసేపు ఆడుకోగానే ఉల్లాసం వస్తుంది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. శునకాలకు అసూయ అనేదే ఉండదు. శునకాలకు అసూయ లేదా చెడు అంటే ఏమిటో తెలియదు. కేవలం ప్రేమించడం మాత్రమే తెలుసు. వాటికి స్నేహపూర్వకంగా ఉండటమే తెలుసు. అందుకే కుక్కలు ఉన్నవారు అదృష్టవంతులు. తనకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించేది ఈ గ్రహం మీద ఉన్న ఏకైక జీవి కుక్క మాత్రమే. తన యజమానిపై కుక్కకు ఉండే ప్రేమ పరిస్థితులకు అతీతంగా ఉంటుంది. కాబట్టి మీరు డాగ్ లవర్స్ అయినా కాకపోయినా.. మీ వీధి కుక్కలకు కాస్తంత ఆహారం అందించి వాటికి ప్రేమ పంచండి. ఈ విశ్వంలో అత్యంత విశ్వసనీయ భాగస్వాములు కుక్కలకు మించి లేవు. కాబట్టి ఈ రోజు నుంచైనా ఒక కుక్కకు ఆశ్రయం ఇవ్వండి.