కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆమె కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రుణ సేకరణపై విధించిన సీలింగ్, రిసోర్స్ గ్యాప్ ఫండింగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కడపలో ఏర్పాటు చేస్తున్న వై.ఎస్.ఆర్ స్టీల్ కార్పొరేషన్‌తోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి. గురువారం నాడే ప్రధాని మోడీతో విజయసాయి భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలు ప్రస్తావించామని ప్రధానికి విజయసాయిరెడ్డి తెలియజేశారు, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారని వైసీపీ వర్గాలు తెలిపాయి. తాజాగా ఆర్థికమంత్రితో విజయసాయి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడిని నిలువరించి, తమ ప్రాణాలను అర్పించిన వీరులకు 20 ఏళ్ళు అయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి నివాళులర్పించారు.
2001లో సరిగ్గా ఇదేరోజున ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి ఎదురొడ్డి నిలిచి తమ ప్రాణాలను అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులర్పించారు. వారి అత్యున్నత త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. దేశ మాతకోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డల రుణం తీర్చలేనిదన్నారు.