అంతర్జాతీయ వన్డేలకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మను బీసీసీఐ నియమించడంతో కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీమిండియా విజయాల్లో ఎంతో కీలక పాత్ర పోషించిన కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తప్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్‌గా టీమిండియా మిగతా వాళ్ల సారథ్యంలో కంటే కోహ్లీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిందని పలువురు అభిమానులు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జనరల్ సెక్రటరీ షా ఇద్దరూ కలిసి కుట్ర పన్నారంటూ కోహ్లీ అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో #ShameonBCCI అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు.
ఐసీసీ ట్రోఫీలు గెలవలేదన్న నెపంతో ఒక మంచి ఆటగాడిని అవమానించడం సబబు కాదని కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. కనీసం ప్రెస్‌మీట్ పెట్టకుండా… చివరి సిరీస్ అని ప్రకటించకుండా అర్థాంతరంగా కోహ్లీని కెప్టెన్‌గా తొలగించడం సరికాదని హితవు పలుకుతున్నారు. అయితే కొందరు క్రికెట్ అభిమానులు మాత్రం కోహ్లీకి తగిన శాస్తి జరిగిందని… గతంలో కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కుంబ్లేను కోచ్ పదవి నుంచి అర్థాంతరంగానే తప్పించాడని… ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదైమైనా కోహ్లీ కోసం పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు.