హైదరాబాద్‌లో ఈనెల 25న ఉదయం 10 గంటలకు టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని అంగరంభ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భాగ్యనగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలో జరిగే ఈ సమావేశానికి వచ్చే రహదారులన్నీ టీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలతో నిండిపోయింది. ఈ ప్లీనరీకి సుమారు 6,500 మంది ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్‌లు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు.. ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ ఈ సమావేశానికి తరలిరానున్నారు. దీంతో భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read Also: హుజురాబాద్ ప్రచారంలో కనిపించని కమలనాథులు?
కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ ఆంక్షలను పాటిస్తూ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. మరోవైపు ప్లీనరీకి వచ్చే అతిథులకు భోజనాలను కూడా వడ్డించనున్నారు. ఇందుకోసం 29 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫుడ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఒకేసారి 8వేల మంది భోజనం చేసేలా డైనింగ్ హాళ్లను హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, మహిళల కోసం ప్రత్యేకంగా డైనింగ్ హాళ్లు ఉంటాయి. కాగా పార్టీ రూల్ ప్రకారం రెండేళ్లకొకసారి టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగాలి. అయితే గత ఏడాది కరోనా కారణంగా ప్లీనరీ సమావేశం నిర్వహించలేదు. చివరిసారిగా 2018లో కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరిగింది.