హుజురాబాద్‌ ప్రచారంలో కనిపించని కమలనాథులు?

హుజురాబాద్‌ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పార్టీలో గుర్తింపు పొందిన నాయకులు ఎందుకు కనిపించడం లేదు? వారు అలిగారా.. లేక ప్రచారంలో వారి అవసరం లేదని పార్టీ భావించిందా? బీజేపీలో కీలకంగా ఉన్న నాయకులపై జరుగుతున్న చర్చ ఏంటి?

హుజురాబాద్‌ ప్రచారంలో కాషాయ దండు..!

హుజురాబాద్ ఎన్నికల ప్రచారం రంజుగా సాగుతుంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాషాయదండు అక్కడికి షిఫ్ట్ అయింది. ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నారు. చిన్న సభలు.. సమావేశాల్లో పాల్గొని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు కూడా. ఏదో ఒకరోజు ఇలా వచ్చి అలా ప్రచారం చేసి వెళ్లినట్టు కాకుండా ప్రచారానికి ఎక్కువ సమయమే కేటాయిస్తున్నారు నాయకులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితురాలు విజయశాంతి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌ జాబితాలో ఉన్న నేతలు అక్కడ ప్రచారం ఉన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కావాలనే దూరం పెట్టారా?

బీజేపీ తరఫున ఎంత మంది ప్రచారం చేస్తున్నా.. పార్టీలో కీలకంగా ఉన్న ఒకరిద్దరు నాయకులు మాత్రం కనిపించడం లేదు. బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్‌ జాడ లేదు. దుబ్బాక, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలు, GHMC ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాజాసింగ్‌. హుజురాబాద్‌కు దూరంగా ఉండిపోయారు. స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో రాజాసింగ్‌ పేరు ఎందుకు చేర్చలేదన్నది ఇప్పటికీ కేడర్‌లో ఒక ప్రశ్నగా ఉంది. హుజురాబాద్‌లో రాజాసింగ్‌ ప్రచారానికి వస్తే ముస్లిం ఓటర్లు దూరం అవుతారనే భయంతో.. సొంత ఎమ్మెల్యేను దూరం పెట్టారని ఒక చర్చ జరుగుతోంది. ప్రచారానికి వెళ్లేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నా.. ఆయన ప్రసంగాలు చేటు తెస్తే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందారట. అందుకే రాజాసింగ్‌ను పక్కన పెట్టారని సమాచారం.

ఇంద్రసేనారెడ్డి అలకలో ఉన్నారా?

బీజేపీ OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ సైతం ఇప్పటి వరకు హుజురాబాద్‌ వెళ్లలేదు. 27తో ఇక్కడ ప్రచారం ముగుస్తుంది. స్టార్‌ క్యాంపెయినర్‌ లిస్ట్‌లో లక్ష్మణ్‌ పేరు ఉంది. ఇక బీజేపీ సీనియర్‌ నాయకుడు ఇంద్రసేనారెడ్డి సైతం సైలెంట్‌. బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించేంత వరకు యాక్టీవ్‌గా ఉన్న ఆయన.. జాబితాలో తన పేరు లేకపోవడంతో హర్ట్‌ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా.. ఎన్నికల కమిషన్‌ వ్యవహారాలు ఇంద్రసేనారెడ్డే చూసేవారు. అలాంటిది ఇప్పుడు పార్టీ ఆఫీస్‌కు కూడా రావడం లేదట. వీరేకాకుండా .. బీజేపీ రాష్ట్ర పదాధికారుల్లో మరికొందరు సైతం హుజురాబాద్‌ ప్రచారానికి దూరంగా ఉండటం పార్టీలో చర్చగా మారింది. మరి..ఎందుకు దూరం పెట్టారో.. ఏంటో బీజేపీ నేతలే చెప్పాలి.

Related Articles

Latest Articles