తిరుపతి.. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి. ఈ నగరంలో పగలు, ప్రతీకారాలు, దొంగతనాలు తక్కువగా నమోదవుతుంటాయి. రాజకీయ దాడులు పక్కన పెడితే నేరాల సంఖ్య తక్కువే. అయితే ఈ మధ్యకాలంలో దొంగతనాలు తిరుపతి వాసుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తిరుపతి సమీప ప్రాంతాల్లో ఆగని చోరీలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. తిరుపతిలో అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగానికి దొంగతనాలు సవాల్ విసురుతున్నాయి.
శ్రీనివాసమంగాపురంలో రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు దొంగలు. బీరువాలోని రూ.50వేల నగదు, 24గ్రాముల బంగారం దోచుకెళ్ళారు. బాధితుడు చలపతి తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరోవైపు వరుస చోరీలు పోలీసులకు సవాల్ గా మారాయి. చెడ్డీ గ్యాంగ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తాళం వేసిన ఇళ్లు, అపార్ట్ మెంట్లను దొంగల ముఠా టార్గెట్ చేస్తోంది. ఇటీవల విద్యానగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో చొరబడ్డ చెడ్డీగ్యాంగ్ కలకలం రేపింది. సీసీ టీవీలో నమోదయిన ఆధారాలను పరిశీలించారు సీసీఎస్ పోలీసు బృందాలు. తిరుపతి నగర శివారు ప్రాంతాల్లోని ఇళ్లను టార్గెట్ చేసిన చెడ్డి గ్యాంగ్ ఆట కట్టించేందుకు పోలీసులు రెడీ అయ్యారు.
బహుళ అంతస్తుల భవనాల వద్ద బందోబస్తు, రాత్రి గస్తీ లను పెంచిన పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది. అంతేకాదు తిరుపతి నగరం, శివారు ప్రాంతాల్లో వుండేవారు తాళాలు వేసి బయటకు వెళ్ళేటప్పుడు, ఎక్కువ రోజులు రాలేనప్పుడు పోలీసులకు తెలపాలని కోరుతున్నారు. ఉత్తర భారతానికి చెందిన చెడ్డీగ్యాంగ్ అరాచకాలు అన్నీ ఇన్నీకావు. చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడిన విద్యా నగర్ కాలనీలోని అపార్ట్మెంట్ లో సేకరించిన ఫింగర్ ప్రింట్స్ , సిసి ఫుటేజ్ తో చెడ్డీ గ్యాంగ్ చేస్తున్న దొంగతనాలతో ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. తాజాగా జరిగిన దొంగతనాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.