పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో బడ్జెట్ సెషన్ లో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు రోజంతా వాయిదా పర్వం కొనసాగింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు ఇవాళ సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు తదితరులు ప్రధాని మోదీ వెంట ఉన్నారు. పార్లమెంట్ లో ప్రతిష్టంభనపై చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read: BJP: కాంగ్రెస్ అధినేత సొంత జిల్లాలో బీజేపీదే విజయం
ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తో మోదీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలని బిజెపి తీవ్రంగా పట్టుబడుతోంది. అయితే, ప్రస్తుతం నిర్ణయం స్పీకర్ వద్ద ఉంది.
Also Read:Accenture layoff: ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌లో కలవరం..19 వేల మంది ఉద్యోగుల తొలగింపు
గత వారం నుండి అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నాయి. అలాగే, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేశాయని ఆరోపిస్తున్నాయి. హిండెన్‌బర్గ్-అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని కోరుతూ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు సభ్యులు స్పీకర్ పోడియం దగ్గర కూడా బైఠాయించారు. అయితే, కేంబ్రిడ్జ్‌లో భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది.
కాగా,ప్రధాని మోదీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని గుజరాత్‌లోని సూరత్ కోర్టు గురువారం దోషిగా తేల్చింది. పరువునష్టం కేసులో ఆయనకు రెండేళ్ల శిక్ష సైతం విధించింది. అయితే, ఏదైనా నేరానికి రెండేళ్ల శిక్ష పడితే..ఆ ప్రజా ప్రతినిధి అనర్హతకు గురవుతారు. కోర్టు తీర్పు వచ్చిన క్షణం నుంచే ఆ ప్రజాప్రతినిధి అనర్హులు అవుతారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.