తెలంగాణ పరిధిలో సత్తుపల్లి, కొత్తగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని లోని నాలుగు బొగ్గుగనుల వేలం వేయడాన్ని సింగరేణి కార్మికులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బొగ్గుగనుల వేలం ప్రక్రియను కేంద్రం విరమించుకోవాలని కోరుతూ మూడు రోజులపాటు కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెకారణంగా తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో సింగరేణికి సుమారు రూ. 120 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. లోక్‌సభలో ఈరోజు జీరో అవర్‌లో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బోగ్గుగనుల వేలం విషయాన్ని ప్రస్తావించారు. లాభాలార్జిస్తున్న సింగరేణి కాలరీస్ ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించకుండా నాలుగు బ్లాకులను వేలం వేయడం అసమంజసం అని అన్నారు.
Read: నటి సమంతకు స్వల్ప అస్వస్థత
వేలం ప్రక్రియను కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దేశంలో సింగరేణికి వందేళ్ల చరిత్ర ఉందని, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థలకు సింగరేణి బొగ్గుసరఫరా చేస్తోందని అన్నారు. సింగరేణి కాలరీస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో పాటు, కేంద్రానికి కూడా వాటాలున్నందువలన కేంద్రం తక్షణమే స్పందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.