ముంబైలో కరోనా కేసులు భయపెడుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో నమోదైన కేసులు నిన్నటి నుంచి వేలల్లో నమోదు కావడం మొదలుపెట్టాయి. సోమవారం రోజున 800 కేసులు నమోదవ్వగా, మంగళవారం రోజున 1300 కేసులు నమోదయ్యాయి. బుధవారం రోజున 2 వేలకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనిపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా థాకరే అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రెండు రోజుల వ్యవధిలో 70 శాతం మేర కేసులు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముంబైలోని ఆసుపత్రుల్లో కోవిడ్ ట్రీట్మెంట్‌కు సంబంధించిన వసతులను పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Read: ఈ రోబోట్స్ అందుబాటులోకి వస్తే…వినాశనమే…!!
ఆక్సీజన్‌ను అందుబాటులో ఉంచాలని అన్నారు. జనవరి మొదటి వారంలో 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదేశించారు. స్కూళ్లు, కాలేజీలలో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 48 గంటల్లోగా నగరంలోని అన్ని ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ విధానాన్ని పెంచాలని, కోవిడ్ కేసులను గుర్తించి ట్రీట్మెంట్ చేయాలని ఆదేశించారు. ఒక్కసారిగా కేసులు భారీగా పెరగడం మూడో వేవ్‌కు సంకేతమా కాదా అనే దానిపై తాను సమాధానం చెప్పలేనని, వైద్యులు, శాస్త్రవేత్తలు సమాధానం చెబుతారని అన్నారు.