ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ ఆరోపణ

ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను కోరారు. హన్మకొండలోని 54వ డివిజన్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు బండి సంజయ్ హాజరయ్యారు. నిందితుడికి మద్దతుగా ధర్నా చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రీతి తల్లి, తండ్రులు ఎంత బాధపడి ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. లవ్ జీహాద్ వల్లే ఇలా అయిందని నేనంటే ఆమె తండ్రిని బెదిరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయన్న అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయకపోవడం వెనక రాజకీయ కోణం ఉందని అన్నారు. కేటీఆర్ సీఎం కావడాన్ని సాయన్న వ్యతిరేకించడం వల్లే ఆయనను అవమానించారని తెలిపారు. బట్టలూడదీసి బతుకమ్మలాడించిన నిరంకుశ నిజాంకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే సాయన్నకు చేయకపోవడం బాధాకరమన్నారు.
సోనియాకు ధన్యవాదాలు తెలపనున్న కాంగ్రెస్ నేతలు

ఛత్తీస్ గఢ్లోని రాయపూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తుల అంశాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. ఈ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. నేడు రెండవ రోజు ఏఐసీసీ ప్లీనరీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు రెండో రోజు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల వరకు పీసీసీ, ఏఐసీసీ ప్రతినిధులు సభాస్థలి కి చేరుకోనున్నారు. ఉదయం 9.45 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేరుకుంటారు. అనంతరం ఉదయం 9.50 గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రిసెప్షన్ కమిటీ ఛైర్మన్ ఛత్తీస్ ఘడ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మరకామ్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్వాగతోపన్యాసం చేస్తారు. ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రారంభోపన్యాసం చేస్తారు.
హనుమంత వాహనంపై జూబ్లిహిల్స్ వేంకటేశ్వరుడు

జూబ్లిహిల్స్ టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న శ్రీ వేంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం శ్రీ మలయప్పస్వామి హనుమంతవాహనంపై ఊరేగుతూ.. భక్తులకు కనువిందు చేస్తున్నారు. ప్రతిరోజూ జరుగుతున్న స్వామివారి ప్రత్యేక పూజలకు జంట నగరాల నుంచి వేలాదిమంది భక్తులు విచ్చేస్తున్నారు. ఉదయం భక్తులకు ప్రసాదాలతో పాటు అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాదాల వితరణ చేస్తున్నారు.
ప్రీతి కుటుంబ సభ్యులకు హరీశ్ పరామర్శ

నిమ్స్ ఆస్పత్రిలో నాలుగో రోజు చికిత్స పొందుతుంది ప్రీతి.. ఇంకా ఆమె పరిస్థితి విషమంగానే ఉందంటున్నారు వైద్యులు.. ఇప్పటికే వేధింపులకు పాల్పడ్డ వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.. DMHOకి రిపోర్టు అందజేసిన ప్రొఫెసర్ల కమిటీ.. కమిటీ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు అధికారులు. మెడికో ప్రీతి ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన విసయం తెలిసిందే.. నాలుగురోజుల నుంచి నిమ్స్ లో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న ప్రీతిని, తల్లిదండ్రులకు పరామర్శించేందుకు పలువురు నేతలు, రాజకీయ నాయకులు వచ్చి ధైర్యం చెబుతున్నారు. ప్రీతి తల్లిదండ్రులను ఓదార్చి ప్రీతికి సరైన వైద్యం అందిచేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, ప్రీతి ఇలా ఉండడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తానని హామీ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని శుక్రవారం ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. రెండు రోజుల జిల్లా పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు వచ్చారు. అనంతరం నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని మంత్రి హరీశ్ రావు అడిగి తెల్సుకున్నారు.
కేఎఫ్ సీ చికెన్ సేఫ్టీ కాదా? విశాఖలో తనిఖీల్లో ఏం తేలింది?

విశాఖ అశిల్ మెట్ట కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఆ.. పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని అధికారులు వెల్లడించారు. KFC సేఫ్ కాదని అంటున్నారు. KFC చికెన్ తింటే క్యాన్సర్ బారినపడే అవకాశాలు ఎక్కవగా ఉంటాయని అధికారులు నిర్ఘాంతపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. దీంతో ప్రజలు కేఎఫ్ సీ చికెన్ తినేందుకు భయపడుతున్నారు.
2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు తెలంగాణ లైఫ్ సైన్సెస్

ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణను కేంద్రంగా మార్చడమే సర్కారు లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆరోగ్య రక్షణ సదస్సు ‘బయో ఆసియా–2023’ హెచ్ఐసీసీలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువ 2030 నాటికి 250 బిలియన్ డాలర్లను దాటుతుందని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అందుకు నాలుగు అంశాలను మూల స్తంభాలుగా ఎంచుకున్నామన్నారు. వాటి సాయంతో లైఫ్ సైన్సెస్ రంగానికి కొత్త రూపు ఇస్తామని మంత్రి ప్రకటించారు. భారత ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం హైదరాబాద్ లోని లైఫ్‌సైన్సెస్ కంపెనీలు వినూత్న, జెనరిక్ ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి.
ఇకపై ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేస్తారు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆర్కా ల్యాబ్ సీఈవో గాయత్రి తెలిపారు. ఇకపై శరీరానికి సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా వ్యాధి ఎంటో నిర్ధారణ చేయవచ్చన్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ పరికరంతో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను సులువుగా గుర్తించవచ్చని సీఈవో గాయత్రి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డివైజ్ తయారీ, వీటి వినియోగానికి అవసరమైన సాంకేతికతను బెంగళూరు కేంద్రంగా అందిస్తున్నట్టు చెప్పారు.
నంద్యాల జిల్లాలో దారుణం.. కన్నకూతురినే చంపేసిన తండ్రి

ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కన్న కూతురినే ఓ తండ్రి అత్యంత కిరాతకంగా చంపేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే ఆ తండ్రి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవేందర్ రెడ్డికి ప్రసన్న అనే కుమార్తె ఉంది. ఈమెకు 18 నెలల క్రితం గోస్పాడు మండలం జిల్లెల్లకు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. తన భర్తతో కలిసి హైదరాబాద్‌కి వచ్చిన ప్రసన్న.. నగరంలో కాపురం పెట్టింది. అయితే.. భర్తతో మనస్పర్థలు ఏర్పడటంతో ప్రసన్న పుట్టింటికి తిరిగొచ్చింది. రోజులు గడుస్తున్నా ప్రసన్న తిరిగి భర్త వద్దకు వెళ్లకపోవడంతో.. కాపురానికి వెళ్లాల్సిందిగా దేవేందర్ రెడ్డి చాలాసార్లు నచ్చజెప్పాడు. ఎన్ని గొడవలు జరిగినా, సర్దుబాటు చేసుకోవాలని చెప్పేందుకు ప్రయత్నించాడు. అయినా పట్టించుకోకుండా ప్రసన్న పుట్టింట్లోనే ఉండిపోయింది. దీంతో తండ్రికి అనుమానం వచ్చింది. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని, అందుకే భర్త వద్దకు వెళ్లకుండా పుట్టింట్లోనే ఉందని అనుమానం కలిగింది.
మరోసారి సీబీఐ ముందుకు మనీశ్ సిసోడియా

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు CBI సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఈ సమన్లలో సీబీఐ పేర్కొంది. ఈ విషయంలో గతంలోనే మనీష్ సిసోడియా స్వయంగా చెప్పారు. గతంలో ఆయన నివాసంలో అధికారులు రైడ్స్ చేశారు. మరి రేపటి విచారణలో మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సిసోడియా ఎలాంటి సమాధానం చెబుతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.