టాలీవుడ్ స్టార్ హీరోస్ అండ్ బిగ్ బడ్జెట్ క్రేజీ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని ‘స్టార్ మా’ కైవసం చేసుకుంది. నిజానికి ఇందులో కొన్ని సినిమాలు ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్ కావాల్సినవి. కానీ కరోనా సెకండ్ వేక్ కారణంగా వాటి షూటింగ్ పూర్తి కావడమే కాదు రిలీజ్ కూడా రీషెడ్యూల్స్ అయ్యాయి. ఇంతకూ స్టార్ మా శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న చిత్రాలేవో తెలుసుకుందాం. ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ హక్కులను స్టార్ మా పొందినట్టు గతంలోనే చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. తాజాగా ఆ సినిమాతో బాటుగా నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘అఖండ’ శాటిలైట్ హక్కుల్ని ఈ ఛానెల్ పొందింది. అలానే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ హక్కులు ఈ ఛానెల్ అందుకుంది. ఇక మాస్ మహరాజా రవితేజ ‘ఖిలాడీ’, అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, అతని అన్న నాగచైతన్య నటిస్తున్న ‘లవ్ స్టోరీ’, నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’, అన్నింటినీ మించి ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాల శాటిలైట్ రైట్స్ ను ఇంతవరకూ స్టార్ మా పొందినట్టు అధికారిక సమాచారం. అలానే నితిన్ ‘మాస్ట్రో’ మూవీ డైరెక్ట్ గా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీని శాటిలైట్ హక్కుల్ని కూడా స్టార్ మా పొందింది.